సిరి క్రియేషన్స్ పతాకంపై శేఖర్ మోడల్ రచన, దర్శకత్వం వహిస్తూ తానే కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఒక్క అడుగు'. సినీ ప్రముఖులు వి.ఎన్. ఆదిత్య, అశోక్ కుమార్, సముద్ర, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, సత్య మాస్టర్ చేతుల మీదుగా ఈ చిత్ర శీర్షిక, తొలి ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు.
నటుడు మురళి, సత్య మాస్టర్, ఎం.వి. రఘు, నిర్మాత పద్మిని నాగులపల్లి, ఫిలిం ఛాంబర్ కార్యదర్శి అశోక్ కుమార్, దర్శకుడు సముద్ర, డాక్టర్ కిరణ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, ''ఈ సినిమాతో శేఖర్ నటుడు, నిర్మాత, దర్శకుడు అనే మూడు అడుగులు వేశారు.
తనను తాను నిరూపించుకుంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను'' అని అన్నారు. ''నాకు నేనే ఒక అవకాశం కల్పించుకుంటూ ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. మా సినిమాకు అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను'' అని నటుడు, దర్శక-నిర్మాత శేఖర్ మోడల్ తెలిపారు.

