Dailyhunt
ఇరాన్‌ నాగరికతను అంతం చేస్తాం!

ఇరాన్‌ నాగరికతను అంతం చేస్తాం!

  • పేట్రేగిన ట్రంప్‌ … ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం
  • ప్రాణత్యాగానికి వెనకాడం : ఇరాన్‌ స్పందన
  • యుద్దరంగానికి తరలాలంటూ యువతకు పిలుపు
  • విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల చుట్టూ మానవహారాలు
  • చర్చలు నిలిపివేసినట్లు ప్రకటన
  • ఇరాన్‌పై దాడులు ముమ్మరం చేసిన అమెరికా, ఇజ్రాయిల్‌

వాషింగ్టన్‌, టెహరాన్‌ : ఇరాన్‌ నాగరికతను అంతం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి పేట్రేగిపోయారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ఆయన చేసిన పోస్ట్‌ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. 'ఇరాన్‌ నాగరికత మొత్తం నేటి రాత్రికే (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయానికి) అంతమైపోతుంది. దానిని ఎవ్వరూ పునరుద్దరించలేరు.' ' అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ కానీ, ఆ విధంగా చెయ్యక తప్పట్లేదు.. ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి నిలిచిపోతుంది.' అని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమైంది. ఇరాన్‌ నాగరికత మొత్తం అంతమవుతుందంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అణు ఆయుధాలు ప్రయోగించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. అయితే, దీనిని వైట్‌హౌస్‌ అధికారులు ఖండించారు. అటువంటి అవకాశం లేదని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపినట్లు 'ఆల్‌జజీర' వార్తా సంస్ఖ ఒక కథనంలో పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై ఇరాన్‌ దీటుగా స్పందించింది. తనతో పాటు 1.40 కోట్ల మంది ఇరాన్‌ ప్రజలు ఈ యుద్ధంలో ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా వున్నారని ఆయన ప్రకటించారు. మాతృభూమి రక్షణ కోసం కావాలంటే స్వచ్ఛందంగా ప్రాణాలు ఇస్తామంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇరాన్‌ అధ్యక్షుడి ప్రకటన వెలువడిన కాసేపటికే అమెరికా గనుక లక్ష్మణ రేఖను ఉల్లంఘిస్తే ప్రతిస్పందన పశ్చిమాసియా ప్రాంతాలను దాటి వుంటుందని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) హెచ్చరించింది. తమ సహనం నశించిందని, అమెరికా, ఇజ్రాయిల్‌ సహా వాటి మిత్రదేశాలపై దాడులు చేస్తామని ప్రకటించింది. అదే సమయంలో యుద్ద రంగానికి తరలాలంటూ దేశ యువతకు పిలుపునిచ్చింది. తమ పిల్లలను సరిహద్దులకు పంపాలని తల్లితండ్రులను కోరింది. యుద్దభూమిలో నిలబడినప్పడే వారు యోధులుగా ఎదుగుతారని పేర్కొంటూ ఈ విజ్ఞప్తి చేసింది. దీనికి కొన్ని గంటల ముందు విడుదల చేసిన మరో ప్రకటనలో విద్యుత్‌ ప్లాంట్ల వద్ద మానవ హారాలు నిర్మించాలని యువతను కోరింది. దేశంలోని మౌలిక వనరులపై దాడులు చేస్తామంటూ రెండు రోజుల క్రితం ట్రంప్‌ చేసిన హెచ్చరికను ఆ ప్రకటనలో ఇఆర్‌జిపి పేర్కొంది. ఆ ప్రకటనలో మంగళవారం అర్ధరాత్రి వరకు సమయం ఇస్తున్నట్లు పేర్కొన్న ట్రంప్‌ తాజాగా, ఇక ఎటువంటి పొడిగింపులు ఉండవని, ఇరాన్‌ నాగరికతను అంతం చేస్తామని హెచ్చరించారు. దీంతో అమెరికాతో శాంతి చర్చలకు ద్వారాలు మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ టెహ్రాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. 'అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష చర్చల మార్గాలను నిలిపివేస్తున్నాం. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి కూడా నిలిచిపోయింది.' అని ఆ సంస్థ ఎక్స్‌లో పేర్కొంది.

వరుస దాడులు

కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా హార్మూజ్‌ జలసంధిని తెరవాలని లేదంటే ఇరాన్‌ వినాశనం తప్పదని అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన గడువు ముగియడానికి కొద్దిగంటలే మిగిలివున్న వేళ మంగళవారం ఇరాన్‌ వ్యాప్తంగా పలు మౌలిక వసతులు, కీలక లక్ష్యాలపై దాడులు జరిగినట్లు వరుసగా వార్తలందుతున్నాయి. అలాగే ఇరాన్‌ ఇంధన నిల్వలకు అత్యంత కీలకమైన ఖర్గ్‌ ద్వీపంలోని పలు మిలటరీ లక్ష్యాలపై కూడా అమెరికా దాడులు జరిపింది. గుర్తు తెలియని అమెరికా సీనియర్‌ అధికారిని ఉటంకిస్తూ మంగళవారం యాక్సిస్‌ వార్తా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. అలాగే టెహరాన్‌కు దక్షిణంగా, ఇరాన్‌ నగరమైన క్వామ్స్‌కు సమీపంలో గల వంతెనపై కూడా దాడులు జరిగాయని ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. కొద్ది నిముషాల క్రితమే క్వామ్స్‌ కమ్యూనికేషన్‌ లైన్లకు సంబంధించిన వంతెనల్లో ఒక దానిపై దాడి జరిగిందని గవర్నర్‌ మోర్తెజా హైదరి తెలిపారు. అలాగే ఇరాన్‌లోని అల్బొరాజ్‌ ప్రావిన్స్‌లో జరిగిన వైమానిక దాడుల్లో 18మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఖొరామాబాద్‌ అంతర్జాతీయ విమా నాశ్రయం లక్ష్యంగా కూడా దాడులు జరిగాయని ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలు అందాల్సి వుందని పేర్కొంది. ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమంతో సంబంధమున్న మిలటరీ స్థావరమైన పర్చిన్‌కు సమీపంలోని ప్రాంతాలపై, టెహరాన్‌కు నట్ట నడిబొడ్డున గల కొన్ని పాయింట్లపై దాడులు జరి గాయి. క్రూయిజ్‌ క్షిపణి ఒక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న వీడియో ఒకటి బాగా వైరల్‌ అయింది. టెహరాన్‌లోని యూదు ప్రార్ధనా మందిరం ఒకటి ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైందని ఇరాన్‌ మెహర్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్‌పై వరుసగా వైమానిక దాడులతో దండెత్తామని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. అంతర్జాతీయ మధ్యవర్తుల నుండి కాల్పుల విరమణకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని ట్రంప్‌ ప్రకటించిన వెంటనే ఈ దాడులు ముమ్మరమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఐడిఎఫ్‌ దాడులను ముగించిందని, టెహరాన్‌లోని తీవ్రవాద మౌలిక వసతులను నాశనం చేశామని ఇజ్రాయిల్‌ మిలటరీ తన అధికారిక టెలిగ్రామ్‌ చానెల్‌లో పేర్కొంది. ఇరాన్‌వ్యాప్తంగా డజన్ల సంఖ్యలో మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని విస్తారంగా దాడులు పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే ఏ ఏ స్థావరాలు, ఇతరత్రా వివరాలను వెల్లడించలేదు. ఈ దాడులతో మరోసారి ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. రికార్డు స్థాయిలో బారెల్‌ ధర 116 డాలర్లకు చేరింది. ఇరాన్‌ యుద్ధం అమెరికా అగ్ర నాయకత్వాన్ని స్తంభింప చేసిందని ఇటలీ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. కాగా యుద్ధాన్ని నిలుపుచేసేందుకు పాకిస్తాన్‌ చేస్తున సానుకూల ప్రయత్నాలు, కీలకమైన దశకు చేరుకున్నాయని పాకిస్తాన్‌లో ఇరాన్‌ రాయబారి రెజా అమిరి మొఘాదమ్‌ వ్యాఖ్యానించారు.

రైళ్ళలో ప్రయాణిస్తే ప్రాణాలకు ముప్పు తప్పదు : ఇజ్రాయిల్‌

ఇరాన్‌ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9గంటల వరకు రైళ్ళలో ప్రయాణాలు చేయవద్దని ఇరాన్‌ ప్రజలను ఇజ్రాయిల్‌ మిలటరీ హెచ్చరించింది. రైళ్ళకు, రైల్వే లైన్లకు సమీపంలో వున్నట్లైతే ప్రాణాలకు ముప్పు తప్పదని స్పష్టం చేసింది. అయితే ఏ ఏ ప్రాంతాల్లోని రైల్వే మార్గాలు తమ లక్ష్యాలనే వివరాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ కూడా అప్రమత్తమైంది. దేశంలోని మాసాద్‌ ఏరియా వ్యాప్తంగా రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ లెబనాన్‌లో బలగాల మోహరింపు
దక్షిణ లెబనాన్‌లో డిఫెన్స్‌ లైన్‌ పొడవునా తమ బలగాల మోహరింపు పూర్తయిందని ఇజ్రాయిల్‌ మిలటరీ మంగళవారం ప్రకటించింది. అయితే ఎక్కడ, ఎంతమంది అనే వివరాలు ఇవ్వలేదు. లెబనాన్‌ భూభాగంలోకి చొచ్చుకువెళ్ళేలా ఎంత దగ్గరలో బలగాలను మోహరించిందనే సమాచారం స్పష్టంగా ఇవ్వలేదు. ఈ దశలో ఐడిఎఫ్‌ సైనికులు తమ యుద్ధ ట్యాంక విధ్వంసక క్షిపణి వ్యవస్థలతో సర్వం మోహరించి వున్నారని మిలటరీ ప్రకటన పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti