Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక్క రోజు వడగాల్పులతో దేశంలో 3,400 అదనపు మరణాలు : నివేదిక

ఒక్క రోజు వడగాల్పులతో దేశంలో 3,400 అదనపు మరణాలు : నివేదిక

న్యూఢిల్లీ : అధిక ఉష్ణోగ్రతలతో ప్రపంచవ్యాప్తంగా మరణాలు పెరుగుతున్నాయని, భారతదేశంలో ఒక్క రోజు వడగాల్పుల కారణంగా దేశవ్యాప్తంగా 3,400 అదనపు మరణాలు నమోదవుతుండగా, వరుసగా ఐదురోజుల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగితే సుమారు 30,000 మరణాలు రికార్డు కావచ్చని ఒక అధ్యయనం వెల్లడించింది.

అమెరికాలోని కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్శిటీకి చెందిన ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ పరిశోధకులు పీయూష్ నారంగ్, అశోక్ గాడ్గిల్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన వివరాలు 'ఫ్రాంటైర్స్ ఇన్ ఎన్విరాన్ మెంట్ హెల్త్' పత్రికలో ప్రచురితమయ్యాయి. భారతదేశంలోని 10 రాష్ట్రాల పరిధిలోని జిల్లాల వారీ మరణాల రేట్లను, 2024 నాటి జనాభా అంచనాలతో సమన్వయం చేసి ఈ అదనపు మరణాలను పరిశోధకులు అంచనా వేశారు.

గత కొన్ని రోజులుగా ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోతుండటంతో వడగాలుల తీవ్రత హెచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా విశ్లేషించగా, వరుసగా ఐదు రోజుల వడగాలుల సమయంలో ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే సుమారు 8,100 అదనపు మరణాలు రికార్డయ్యాయని, అలాగే అహ్మదాబాద్, జైపూర్, సూరత్ వంటి నగరాల్లో ఒక్కోసారి 250కి పైగా అదనపు మరణాలు సంభవించాయని తేలింది. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక మరణాల భారం మోస్తున్న ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో మరణాల తీవ్రతకు, అక్కడి ఆర్థిక సామర్థ్యానికి మధ్య 2.3 రెట్ల అసమానత ఉన్నట్లు గుర్తించారు. ఈ ఐదు రాష్ట్రాలు కలిసి దేశంలోని మొత్తం వడగాల్పుల అదనపు మరణాలలో 66 శాతం వాటాను కలిగి ఉండగా, భారతదేశ జీడీపీలో వీటి వాటా కేవలం 29 శాతమే కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఫలితాలు భారతదేశం తన వడగాల్పుల నిరోధక వ్యవస్థలను రూపొందించుకోవడంలోనూ, నిధుల కేటాయింపుల్లోనూ తక్షణ మార్పులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని పరిశోధకులు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద కేటాయించే కేంద్ర నిధులను కేవలం జనాభా లేదా పరిపాలనా సామర్థ్యానికి అనుపాతంలో కాకుండా, ఆర్థికంగా వెనుకబడి ఉండి వడగాల్పుల భారం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సాయం అందించేలా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేశారు. దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశం ఉష్ణోగ్రత సంబంధిత మరణాలకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందన్న అంతర్జాతీయ మోడలింగ్ అంచనాలకు ఈ అధ్యయనం బలమైన నిదర్శనంగా నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti