- ఎన్నికల నిర్వహణపై మళ్లీ సందిగ్ధత
- హై కోర్టు గ్రీన్ సిగల్
- సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/కలెక్టరేట్: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అంతలో ఎన్నికల నిర్వహణకు వీలు కాదని, హై కోర్టు తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతోంది...
పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎపి హైకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం రద్దు చేసింది.
ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లేనని రాష్ట్ర ఎన్నికల సంఘం అంటోంది. గతంలో ప్రకటించిన విధంగానే శనివారం నుంచి నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలకు విడతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుండగా జిల్లాలో రెండు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది.
జిల్లాలో మొత్తం 970 గ్రామ పంచాయతీలు, 10,006 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇది వరకే యంత్రాంగం చర్యలు చేపట్టింది. మొదటి విడతలో నంద్యాల, కర్నూలు డివిజన్ పరిధిలోని పంచాయతీలకు, రెండో విడతలో ఆదోని డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే ఎన్నికల సామాగ్రి కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసుకుంది. సుప్రీం కోర్టులో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పు వస్తే గతంలో ప్రకటించిన తేదీల్లో ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది.
అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 970 గ్రామ పంచాయతీలు, 10,006 వార్డులు ఉండగా 10,212 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. జిల్లాలోని పంచాయతీల్లో 21,15,243 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధం ఎప్పుడు వీడుతుందోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

