Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరిణత వాదం .. పదునైన కథనం .

పరిణత వాదం .. పదునైన కథనం .

'కష్టాలకు కారణాలైన వాటిని ద్వేషించకపోవడమే జీవితం పట్ల గౌరవం అంటే' అంటాడు బుచ్చిబాబు. కష్టాలను ద్వేషించకుండానే వాటిని ఎదుర్కోవడం నిర్మూలింపచేయడం సాధ్యమే అంటాడు.

ఈ సానుభూతి ప్రతి రచయితకు అవసరమనీ, అందుకు పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథను ఉదాహరణగా కూడా చూపిస్తాడు. పద్మావతి రాంభక్త గారి కవిత్వాన్ని, కథలను చదివే క్రమంలో ఈ వ్యాఖ్యలు గుర్తుకు వచ్చాయి. ఆమె వెలువరించిన రెండు చందమామలు కథాసంపుటిలోని కథల్లో ప్రత్యక్ష పరోక్ష శత్రువర్గం ఉంటుంది. సమస్యలూ ఉంటాయి. కానీ ప్రధాన పాత్రలు వాటిని ద్వేషించకుండానే నిలదొక్కుకొని గెలుపు తీరాల వైపు పయనిస్తాయి. ఈ సంపుటిలో 17 కథలు ఉండగా, అందులో 10 కథలు మహిళల సమస్యలను, వారి మనోభావాలను విశ్లేషించినవే!
ధనికుడైన శ్రీనివాసరావు గృహప్రవేశం రోజు అతడి దురహంకార ప్రవర్తన కారణంగా శ్రామిక వర్గానికి చెందిన కూలీలు ఎల్లమ్మ, రంగయ్య పని మాత్రమే చేసి, వారు ఇంటి నుండి తెచ్చుకున్న క్యారేజీల భోజనాన్ని చేసి, స్వాభిమానాన్ని ప్రకటిస్తారు. కాంట్రాక్టర్ల అవినీతి కారణంగా ఒక కొడుకుని పోగొట్టుకొని వారిని ఎదిరించలేక, న్యాయం జరగక తన ఆదర్శాలను పక్కనపెట్టి సంఘర్షణకు లోనై విదేశాలకు చేరిన దేశభక్తుడైన లక్ష్మీ నరసయ్య మాస్టారు చేత దేశమంతా అవినీతిమయమై పోయిందని తెలియచెప్పే కథ విలయం. 'మనుషుల మధ్య సన్నని తెరలు మొలవడం మొదలైతే అవి కొన్నాళ్ళకు పటిష్టమైన గోడలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది' అని ప్రకాశ్‌ పాత్ర చేత చెప్పించిన మనస్తత్వాల భేదాలను విశదపరిచిన కథ నలుపు తెలుపు. 'అంతరంగంలోని అల్లకల్లోలాలను, ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితులను గలగల నవ్వుల వెనుక దాస్తూ చిరునవ్వులతో ఎదుర్కొంటున్న స్త్రీలు ఎందరో. నవ్వుని కూడా వేషధారణలో ఒకటిగా ధరిస్తున్న ఉద్యోగులు లెక్కకు మిక్కిలి. ఈ అలంకారం నేటి స్త్రీకి తప్పనిసరి అనే భావనలో ఉంటున్న కాలంలో రాదగిన కథ సుహాసిని నవ్వు. నడిపించే నీడ కథలో ఆమెను ఇష్టపడిన వ్యక్తితో కాకుండా వేరే అతనితో పెళ్లి చేసి విదేశాలకు పంపిస్తారు తల్లిదండ్రులు. నెల రోజులకే భర్తలో మార్పు మొదలై ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత అది వికృత రూపం దాల్చి స్వదేశానికి వెళ్లి మరో ఆమెతో కలిసి జీవించడాన్ని గమనించిన ఆమె తిరిగి విదేశానికి వెళ్లి ఇద్దరు కొడుకులతో జీవితంలో నిలదొక్కుకున్నప్పటికీ కొడుకులతో కూడా ఆశించిన ప్రేమను పొందలేకపోవడం ఆమెలో నిరాశను కలిగిస్తుంది. భర్త డబ్బులతో పిల్లలను చదివించడానికి కూడా ఇష్టపడకుండా వాళ్లు స్వతంత్రంగా బతకగలిగితే చాలనుకుంటుంది. అవివాహితుడుగా ఉండిపోయిన మొదట ప్రేమించిన వ్యక్తి అతని జీవితంలోకి ఆమెను ఆహ్వానించినా ఒంటరిగానే జీవించాలనుకోవడం, సమస్యలను జయించాలనుకోవడం ఇందులోని ప్రధాన అంశాలు. "ఏ ఎడారి గుండా ప్రయాణించినా ఒంటరితనమే నన్ను నడిపించే నీడ" అని స్పష్టంగా వెలిబుచ్చడం నిరాశవాదంలా కాకుండా జీవితానుభవపు అవగాహనలోంచి తను స్పష్టతతో తీసుకున్న నిర్ణయంగా వ్యక్తమవుతుంది. అపురూప అననుకూలుడైన భర్త ఇన్ఫీరియారిటీతో బాధలకు గురి చేస్తున్నప్పుడు, వృత్తికి ప్రాధాన్యతను ఇచ్చి పిల్లలను తీసుకుని ఊరికి దూరంగా వెళుతుంది. భర్తకు దూరంగా జరిగినా పిల్లలతో కుటుంబాన్ని వఅత్తిని రెండిటిని జయిస్తుంది. ఇది 'రెండు ఆకాశాల మధ్య' కథా ఇతివృత్తం.​
'రెండు చందమామలు' కథలో క్యాన్సర్‌ కారణంగా రెండు రొమ్ములను కోల్పోయి భర్త పవన్‌ నిరాదరణకు గురైన శాంతి తల్లిదండ్రుల నుండి కూడా పూర్తి మద్దతును పొందలేక పోతుంది. ఒంటరిగా జీవన పథాన్ని ప్రారంభించి ఆర్థిక స్వావలంబనతో క్యాన్సర్‌ అవేర్నెస్‌ ప్రోగ్రామ్స్‌ ఇంటర్వ్యూలు ఇస్తూ టీవీ వార్తాపత్రికలు సోషల్‌ మీడియాలోనూ ప్రసిద్ధురాలవుతుంది. అంచెలంచెలుగా ఎదిగి ప్రైమ్‌ మినిస్టర్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుంది. "అమ్మానాన్నలు ఇంకా అలాగే ఆలోచిస్తున్నారా? పవన్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడా? తన ఒంటరి జీవితం ఇకపై ఎలా గడుస్తుంది?" ఇటువంటి ఆలోచనలకి శాంతికి సమయం లేదు అంటుంది రచయిత్రి. ఇదే ఆమె సాధించిన గొప్ప విజయంగా అందరం అంగీకరిస్తాము. రెండు రొమ్ములకు ప్రతీకలుగా రెండు చందమామలను; కుటుంబం, వృత్తులకు ప్రతీకలుగా రెండు ఆకాశాలని చెప్పడం ప్రతి శీర్షిక ధ్వని పూరితంగా ఉండడం ఈ సంపుటికి అదనపు ఆకర్షణ.
స్త్రీవాదం 1960 నాటికి స్పష్టమైన రూపం తీసుకోగా స్త్రీవాద సిద్ధాంత అవగాహనతో స్త్రీలు రచనలు చేయడం 1980 నాటికి ప్రారంభమైంది. కాలానుగుణంగా వస్తున్న సామాజిక పరిణామాలను గమనిస్తే ద్వేషాలు ప్రతీకారాలు లేనంత మాత్రాన ఈ సంపుటిని స్త్రీవాద కథా సంపుటుల నుండి మినహాయించలేము. రెండు ఆకాశాల మధ్య, రెండు చందమామలు, ఆకాశమంత, నడిపించే నీడ, సుహాసిని నవ్వు మొదలైన కథల్లో ప్రధాన పాత్రలు మహిళలే ఇతివృత్తాలన్నీ మహిళల వెతలే. ప్రత్యర్ధులు కచ్చితంగా పురుషులే. అయినప్పటికీ ఏ కథలోనూ పురుష ద్వేషం ప్రతీకార వాంఛ మచ్చుకైనా కనిపించదు. ప్రతి స్త్రీ పాత్ర తన అస్తిత్వాన్ని ప్రకటించుకుంటుంది. అవసరమైనప్పుడు పురుషులకు దూరంగా జరిగి బలమైన ధిక్కారాన్ని ప్రకటించి ఒంటరిగా ఎదిగి వారి ఆత్మ గౌరవాలను పతాక స్థాయిలో నిలబెట్టుకుంటారు. ఇది అసలైన స్త్రీవాదమని తెలుపడమే ఈ కథా సంపుటి ప్రత్యేకత.

- డా. కాచాపురం దుర్గాదేవి
78930 93495

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti