Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి

• రేపటి తరాలకు పచ్చని భవిష్యత్తును అందించేందుకు సహకరించాలి

• పారిశ్రామిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు

మరావతి : రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పారిశ్రామికవేత్త దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు.

అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణలను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లినప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమాజానికి, ప్రకృతికి, రాబోయే తరాలకు విలువైన భవిష్యత్తును అందించగలమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పరిశ్రమలు 33 శాతం పచ్చదనం నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ-గ్రీన్ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

2026 గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, సిమెంట్, మైనింగ్, ఎనర్జీ, ఆహార శుద్ధి, ప్లాస్టిక్, పేపర్, వస్త్రాలు తదితర రంగాలకు చెందిన సుమారు 3,400 పరిశ్రమలు, కంపెనీలు వేలాది ఎకరాల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తొలి విడతగా పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 26 పరిశ్రమల్లో 129 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పరిశ్రమల యాజమాన్యాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలు 33 శాతం పచ్చదనం లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా విశాఖపట్నం వంటి నగరాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసి, పట్టణ ప్రజలు కాలుష్య ప్రభావానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీ సిటీ, పరవాడ తదితర ప్రాంతాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZలు) కూడా 33 శాతం పచ్చదనాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న మహత్తర సంకల్పంలో పారిశ్రామిక వర్గాలు చురుకుగా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti