లక్నో : పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల ప్రక్రియను సుప్రీంకోర్టు తక్షణమే సుమోటోగా స్వీకరించాలని, అలాగే ఓట్ల లెక్కింపు వీడియో రికార్డింగ్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'సీసీటీవీ ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు? దానికి ఎందుకంత భయపడుతున్నారు? పశ్చిమ బెంగాల్ ఎన్నికలను సుప్రీంకోర్టు తక్షణమే సుమోటోగా స్వీకరించి, ఓట్ల లెక్కింపు వీడియోను దేశ ప్రజల ముందు ఉంచాలన్నదే మా డిమాండ్," అని ఆయన అన్నారు.
కాగా, ఈ సందర్బంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలను గురించి ఆయన ప్రస్తావించారు. బెంగాల్ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి నేతలు చేసిన పని, ఎన్నికలను ప్రభావితం చేసిన తీరు ఇప్పుడు బట్టబయలయ్యాయి అని ఎత్తిచూపారు. ఈ మీడియా సమావేశంలో మీరు మమతా బెనర్జీని కలుస్తారా? అని ఆయన్ను విలేకరులు అడగ్గా.. తాను పశ్చిమ బెంగాల్ వెళ్తానని అఖిలేష్ బదులిచ్చారు.

