Sunday, 14 Apr, 12.04 pm ప్రజాశక్తి

తాజా వార్తలు
పట్టణ స్థానిక సంస్థలు (అధికరణ-74)

- గ్రూప్‌-3 (గ్రామ పంచాయతీ కార్యదర్శి) పరీక్షల ప్రత్యేకం
ఇందులో ప్రధానంగా మూడు పట్టణ స్థానిక సంస్థల గురించి తెలుసుకుందాం.
1. మున్సిపల్‌ కార్పొరేషన్‌
2. పురపాలక సంఘం
3. నగర పంచాయితీ
వీటికి తోడుగా ఇతర స్థానిక సంస్థలు కంటోన్మెంట్‌ బోర్డులు, టౌన్‌షిప్‌లు, ఏరియా డెవలప్‌మెంట్‌ కమిటీలు కూడా ఉంటాయి.
మున్సిపల్‌ కార్పొరేషన్‌
పెద్ద నగరాలు లేక కాస్మోపాలిటన్‌ నగరాల్లో మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు. దీని ఆదాయం 10 లక్షలకు పైన ఉంటుంది. ఒక కోటి జనాభా గల పెద్ద పట్టణాల్లో ఏర్పాటు చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు మొదలైన నగరాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్‌ ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే పాలనా నిర్వహణ కొనసాగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రాజకీయ అధికారులను ఎన్నుకునే పద్ధతి కూడా ఉంది.
కార్పొరేటర్ల ఎన్నికలలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళా వర్గాలకు నిర్దేశించబడిన రిజర్వేషన్లు అమలవుతాయి. వీరికితోడు కో-అప్టెడ్‌ సభ్యులు, అధికారిక సభ్యులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు కూడా ఉంటారు.
ఈ స్థానిక సంస్థలు తక్కువ ఆర్థిక మూలాలతో, ఎక్కువ నియంత్రణలతో నిర్వహించబడుతున్నాయి. అంటే ఈ సంస్థలు స్వయంపాలన చేసే విధంగా అవకాశాలు కల్పించబడినాయి.
రాజకీయ ఆర్థికవర్గం
ప్రతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నుకోబడిన ముఖ్య అధిపతి (మేయర్‌) ఉంటారు. కొన్ని సందర్భాలలో వీరిని కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకొంటారు. కానీ అధిక సంఖ్యాక కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నిక జరుపబడుతుంది. వీరి పదవీకాలం అధికారాలు, విధులు మొదలైన అనేక అంశాలను వాటికి ఏర్పాటు చేసే శాసనసభ చట్టంలో వివరించబడతాయి.
మేయర్‌
మేయర్‌ కార్పొరేషన్‌ అధిపతి, ప్రథమనగర పౌరుడు వాస్తవ అధికారి కాదు. ఆయన ప్రజాప్రతినిధి కౌన్సిల్‌చే ఎన్నుకోబడిన అధిక హోదా, గుర్తింపుగల ప్రజాప్రతినిధి, ప్రస్తుతం ఆ పదవి అలంకారప్రాయంగా ఉంది. మేయర్‌ పదవీకాలం ఐదు సంవత్సరాలు. మరల ఎన్నిక కావచ్చును. ఈయనను అధికారం నుంచి అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన ఆమోదం ద్వారా తొలగించగలరు. మేయర్‌కు కౌన్సిల్‌లో అధిక సంఖ్యాకుల ఆమోదం అవసరం. ఆయన తన రాజీనామా సమర్పించి, పదవి నుంచి తప్పుకోవచ్చు. అప్పుడు డిప్యూటీ మేయర్‌, మేయర్‌ పదవిని నిర్వహిస్తారు.
అధికారాలు - విధులు
మేయర్‌ పదవి ఉత్సవ పూర్వకమైనది. నామమాత్రపు అధికారాలు కలవు అని చెప్పబడినను, కొన్ని అధికారాలు ఆయనకు కేటాయించబడి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఈ అధికారాలలో కొన్ని ప్రత్యేక భిన్నత్వాలున్నా ఆయనకు అధికారాలు కలవు అని చెప్పవచ్చు. అవి..
1. ప్రథమ నగర పౌరునిగా, ఆయన అన్ని పౌర సమావేశాలకు అధ్యక్షునిగా వ్యవహరిస్తారు.
2. పురపాలక కార్పొరేషన్‌ సమావేశాలకు, కౌన్సిల్‌ సమావేశాలకు ఇతర సంఘాల సమావేశాలకు అధ్యక్షత వహించి, కార్యక్రమాలను ఉత్తమ ఆదర్శవంతమైన మార్గంలో నడిపిస్తారు.
3. కార్పొరేషన్‌లో నిర్వహించే అన్ని సమావేశాలను ఏర్పాటుచేస్తారు.
4. నిర్ణాయకపు ఓటు వేసే హక్కు ఉంది.
5. ఆయనకు కార్పొరేషన్‌ రికార్డులు, ఆధీన కార్యాలయాలను చూసే అధికారం ఉంది.
6. కార్పొరేషన్‌కు అధికార వర్గాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్‌కు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.
7. మేయర్‌ కార్పొరేషన్‌ పనులను, ఆధీన కార్యాలయాలను ఇతర అధికార వర్గాలను పర్యవేక్షణ, తనిఖీ, నియంత్రణ చేస్తారు.
8. ప్రజల నుంచి స్వీకరించే మహాజర్లు, నివేదికలు, డిమాండ్లు కమిషనర్‌కు పంపి, వాటిని నిర్వర్తించే సూచనలు చేస్తారు.
9. కొన్ని కార్పొరేషన్‌లో ఆర్థిక, కార్యనిర్వాహక, అధికారాలు ఉంటాయి. ్య

కార్పొరేషన్‌ కౌన్సిల్‌ కమిటీలు
మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కౌన్సిల్‌ కమిటీలు కార్పొరేషన్‌ కౌన్సిల్‌గా చెప్పబడుతుంది. ఇది శాసన చర్చా వేదికగా వ్యవహరిస్తుంది. ఈ కమిటీలు అధికారిక కమిటీలుగా పరిగణింపబడటం వల్ల కార్పొరేషన్‌ విధుల నిర్వహణలో ప్రధాన భూమికను పోషిస్తాయి. వీటిపై చర్చలు చేసి, తీర్మానాలు నిర్ణయాలు చేయడం, వాటిని అమలు పరిచేటట్లు చేసే కార్యనిర్వహక విధులు నిర్వర్తిస్తాయి.
కమిటీలు
కమిటీ సభ్యుల సంఖ్య, ఇతర అంశాలను రాష్ట్ర శాసన సభే శాసనం ద్వారా నిర్ణయిస్తుంది. సాధారణంగా మూడు నుంచి 16 మంది సభ్యులుంటారు. ఈ కమిటీ సభ్యులను, ఛైర్మన్లను ఆ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, ఇతర సభ్యులు ఎన్నుకొంటారు. కమిటీ సమావేశాలలో కనీస హాజరు సంఖ్య 1/5 వంతు మంది. కమిటీలో మెజారిటీ సభ్యులు తీర్మానాలు, నిర్ణయాలు చేస్తారు. వాటిని కమిషనర్‌ అమలు చేయాలి.
కార్పొరేషన్‌ కౌన్సిల్‌ ప్రత్యేక ప్రయోజనాల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఆరోగ్యం, లైసెన్సులు, మొదలైన ప్రత్యేక విషయాలపై సిఫార్సులు చేసేందుకు ఇతర ప్రత్యేక పనులపై తీర్మానాలు చేస్తాయి.
ఈ కమిటీ సభ్యులు కార్పొరేషన్‌ దైనందిన విధినిర్వహణలో జోక్యం కల్పించుకోకూడదు. వారు ఆ కార్పొరేషన్‌ పరిధిలోని పౌరులందరికీ ప్రాతినిధ్యం వహించే విధంగా పనిచేయాలి. కౌన్సిల్‌ కమిటీలు కార్పొరేషన్‌ అధికారులను ఆ పరిధిలోగల పౌరులందరికీ సేవలందించే విధంగా మార్గదర్శనం చేయాలి.
స్థాయీ సంఘాల కార్యనిర్వహక, పర్యవేక్షక, ఆర్థిక అధికారాలను కలిగి ఉంటాయి. వీరి నిర్ణయాలు, తీర్మానాలు కౌన్సిల్‌ ఆమోదంతో చేయబడటం వల్ల తుది నిర్ణయాలుగా అమలు జరుపబడతాయి. ఇలాంటి కమిటీలు ప్రజల ప్రయోజనాలను, ఆకాంక్షలను, సౌకర్యాలను, శ్రేయస్సును పెంపొందించడం చాలా అవసరం అవుతాయి.
మేయర్‌ అధికారాలు
పురపాలక కౌన్సిల్‌ అంటే మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు అందరూ కలిసి ఉండే సభ. వీరు ఈ కింది విధులు, అధికారాలు నిర్వర్తిస్తారు.
1. సమావేశాలలో బైలాస్‌, నియమాలు, నిబంధనలు తయారుచేసి, ఆమోదింపజేస్తుంది.
2. చట్టంలోని అధికార పరిధులలో వివిధ రకాల పన్నులు విధిస్తుంది.
3. మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ను చర్చించి, ఆమోదిస్తుంది.
4. పాలనా వ్యవహారాలు, నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణలను చేస్తుంది.
5. కార్పొరేషన్‌ పాలనా వ్యవహారాల్లో ప్రశ్నలు వేసి, వాటికి జవాబులను కమిషనర్‌ నుంచి తెప్పించుకుంటారు.
6. కార్పొరేషన్‌ పాలనా సంబంధిత రికార్డులను, ఇతర అంశాలను కోరి, పొందే అధికారం ఉంది.
7. రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషనర్‌ బదిలీ తొలగింపుల గురించి కౌన్సిల్‌ ఆమోదంతో తీర్మానాన్ని పంపుతుంది.
8. కొన్ని రకాల ఉద్యోగుల నియామకం చేస్తుంది.
పౌర సంబంధిత విధులు, అధికారాలు
74వ రాజ్యాంగ సవరణ ఆధారంగా 12వ షెడ్యూల్‌లో పట్టణ స్థానిక సంస్థల అధికారాలను పొందుపరిచారు. అవి 18 రకాలు.
1. నగర ప్రణాళికలు.
2. భూ వినియోగాలను క్రమబద్ధీకరించడం, కట్టడాలను క్రమబద్ధీకరించడం.
3. అభివృద్ధిని ఉద్దేశించే సామాజిక, ఆర్థిక ప్రణాళికలు, కార్యక్రమాలు రూపొందించడం, అమలు చేయడం.
4. రోడ్లు, భవనాల నిర్మాణాలు, మరమ్మతులు.
5. గృహ వినియోగాలు, ఇతర వినియోగాలకు నీటి సరఫరా.
6. ప్రజారోగ్యం, శానిటేషన్‌, కఠిన నీటి పరిశుభ్రత నిర్వహణ.
7. అగ్నిమాపక దళాలు, స్టేషన్‌ల ఏర్పాటు.
8. పట్టణ అటవీ పరిరక్షణ, పరిసరాల పరిరక్షణ.
9. దళిత, బలహీన వర్గాలు, ఇతర సహవర్గాల పరిరక్షణ.
10. మురికివాడల నిర్మూలన, అభివృద్ధి.
11. పట్టణ బీదరిక నిర్మూలన - బీద జనోద్ధరణం.
12. పార్కులు, ఆట స్థలాలు, ఇతర అలాంటి వాటిని ఏర్పాటు చేసి నిర్వహించడం.
13. విద్యా, సాంస్కృతిక, ఇతర రకాల అంశాల అభివృద్ధికి కృషి చేయడం.
14. శ్మశానవాటిక ఏర్పాటు నిర్వహణ, విద్యుద్ధీకర శ్మశాన వాటికల ఏర్పాటు.
15. జంతు హింసను నివారించడం, పశుగ్రాసం సంరక్షణ ఏర్పాట్లు.
16. జనన మరణాల నమోదు, జనాభా గణన.
17. వీధిదీపాలు, బస్సు నిలిపే ప్రదేశాలు, వాహన నిలుపు ప్రదేశాలు ఏర్పాటు చేయడం.
18. కబేళాల ఏర్పాట్లు, నిర్వహణ. తోలు పరిశుభ్ర పరిశ్రమల ఏర్పాట్లు. ్య

- కె.ఎస్‌. లక్ష్మణరావు,
శాసనమండలి సభ్యులు.
సెల్‌ : 9440262072

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top