Tuesday, 14 Sep, 10.45 pm ప్రజాశక్తి

జిల్లా వార్తలు
పట్టని 'కౌలు' గోడు

- గుర్తింపు కార్డులూ కరువు
- సంతకాలు చేసేందుకు భూ యజమానుల నిరాసక్తి
- దక్కని రుణాలు, ప్రయోజనాలు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి:
వ్యవసాయమే ప్రధానంగా ఉన్న జిల్లాలో కౌలు రైతులకు భరోసా కరువైంది. కౌలు రైతులను ఆదుకుంటామని చెబుతున్న పాలకుల హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. గతేడాది సగం మందికే రుణ అర్హత కార్డులు అందాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో వారికి రుణాలతో పాటు సాగుకు సాయమందించే ఏ ప్రయోజనాలూ దక్కడం లేదు. దీంతో పంట సాగు కోసం జిల్లాలోని కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...
జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది కౌలు రైతులు ఇతరుల నుంచి భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారిలో గతేడాది 39 వేల మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు జారీ చేశారు. మిగిలిన వారికి అర్హత ఉన్నా కార్డులు అందలేదు. వైసిపి ప్రభుత్వం వచ్చాకా భూ సాగుదారుల హక్కు చట్టం(సిసిఆర్‌) తీసుకువచ్చారు. అందులో కౌలు రైతు గుర్తింపు కార్డు మంజూరుకు భూ యజమాని అంగీకారపత్రంతో ప్రభుత్వం ముడి పెట్టడం కౌలుదారుల పాలిట శాపంగా మారింది. పంట నష్ట పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ తమకే దక్కాలన్న ఉద్దేశంతో సగం మందికి పైగా భూ యజమానులు భూ యజమాని అంగీకారపత్రంలో సంతకాలు చేసేందుకు నిరాసక్తి చూపుతున్నారు. దాంతో కౌలు రైతులు నష్టపోతున్నారు. బ్యాంకులతో రుణాలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 605 మంది కౌలు రైతులకు మాత్రమే రుణాలు అందాయి. జిల్లాలో రూ.100 కోట్ల దాకా రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.1.45 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. అప్పటికే యజమాని ఆ భూమి మీద రుణం తీసుకోవడంతో కౌలు రైతులకు రుణం ఇచ్చేందుకు అవకాశం లేదని బ్యాంకులో రుణాలు ఇవ్వడం లేదు. దీంతో కౌలు రైతులు ప్రయివేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలను తీసుకోవాల్సి వస్తోంది. పంట దిగుబడి సరిగ్గా రాక అప్పులపాలవుతున్నారు. క్రాప్‌ బుకింగ్‌ చేసే సమయంలోనూ కౌలు రైతులను అన్యాయం జరుగుతోంది. కౌలుకు తీసుకున్న మొత్తం ఎకరాలకు కాకుండా కొంత మొత్తానికి మాత్రమే క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్నారు. క్రాప్‌ బుకింగ్‌లో పేరు లేదని, తక్కువ ఎకరాలు ఉన్నాయని మొక్కజొన్న విత్తనాలను కౌలు రైతులకు ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ విత్తనాలేవీ కౌలు రైతులకు అందడం లేదు. కౌలు రైతులను గుర్తించేందుకు సోమవారం నుంచి పలు ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. వాటిలో అర్హులను గుర్తించి గుర్తింపుకార్డులు పంపిణీ చేసినా ఖరీఫ్‌ సాగుకు ప్రయోజనాలు అందేలా కనిపించడం లేదు.
ప్రయివేటు వ్యక్తుల నుంచి రుణం
12 ఏళ్లుగా మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాను. గత ఏడాది రుణ అర్హత కార్డు వచ్చింది. ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకూ కౌలు రైతు గుర్తింపు కార్డు ఇవ్వలేదు. దాంతో బ్యాంకులో రుణం ఇవ్వలేదు. ప్రయివేటు వ్యక్తుల నుంచి రూ.50వేలు రుణం తీసుకుని పెట్టుబడి పెట్టి బొప్పాయి పంట వేశాను. అధిక వర్షాలకు పంట మొత్తం నష్టపోయాను. 11 ఏళ్లుగా ఇప్పటి వరకూ పంట నష్ట పరిహారం రాలేదు.
- కొండాపురం రామచంద్ర, బొల్లవరం కల్లూరు మండలం.

అందరికీ ప్రయోజనాలు అందేలా చూడాలి
భూ యజమాని అంగీకారంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులను మంజూరు చేయాలి. విఆర్‌ఒలతో సర్వే చేయించి క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా కార్డులను ఇవ్వాలి. అర్హత ఉన్న కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. ప్రభుత్వం నుంచి అందరికీ రుణాలు, ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
- ఎ.కృష్ణ, కర్నూలు జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top