Dailyhunt
పవన్‌ ఖేరా నివాసంలో అస్సాం పోలీసుల సోదాలు

పవన్‌ ఖేరా నివాసంలో అస్సాం పోలీసుల సోదాలు

న్యూఢిల్లీ : అస్సాం ముఖ్యమంత్రి భార్య పాస్‌పోర్ట్‌ వివాదంపై అస్సాం పోలీసులు మంగళవారం కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులతో పాటు నిజాముద్దీన్‌ ఈస్ట్‌లో ఉన్న ఆయన నివాసంలో సోదాలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే పోలీసులు వచ్చిన సమయానికి పవన్‌ ఖేరా ఇంట్లోలేరని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. హిమంత శర్మ భార్య రినికి భుయాన్‌ సోమవారం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.

హిమంత బిస్వా భార్య రినికి భుయాన్‌ శర్మకు యుఎఇ, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా, ఈజిప్ట్‌ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లుఉన్నాయని, అలాగే దుబారులో ఆమెకు విలాసవంతమైన భవనాలు ఉన్నాయని ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్‌ ఖేరా పేర్కొన్న సంగతి తెలిసిందే. అమెరికాలోని వ్యోమింగ్‌లో ఒక కంపెనీ కూడా ఉందని అన్నారు. వాటికి సంబంధించి పత్రాలను మీడియాకు విడుదల చేశారు.
తన భార్యపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో తమకు అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయని ఆరోపించేందుకు వినియోగించిన ఆస్తిపత్రాలు, డాక్యుమెంట్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్క్రైబ్డ్‌ నుండి దొంగిలించారని ఆరోపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti