Wednesday, 16 Oct, 1.35 am ప్రజాశక్తి

తాజావార్తలు
పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి

* ఏక్తా శక్తి సంస్థను రద్దు చేయాలి
* ఎపి 'మధ్యాహ్న భోజన' కార్మికుల యూనియన్‌
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించోద్దని, జూన్‌ నెల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు, మెనూ ఛార్జీలను వెంటనే చెల్లించాలని, రాజకీయ కారణాలతో వర్కర్ల తొలగింపు ఆపాలని కోరుతూ ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ నాయకులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ను కోరారు. ఈ మేరకు యూనియన్‌ అధ్యక్షులు జి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కె స్వరూపరాణి, ఉపాధ్యక్షులు జి బేబిరాణి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి నుంచి 9,10 తరగతులకు బిల్లులు, ఏప్రిల్‌ నుంచి 8వ తరగతి వరకు బిల్లులు, వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు కొన్ని జిల్లాల్లో 10 నెలల బిల్లులతోపాటు కరువు మండలాల్లో బిల్లులూ రాలేదని పేర్కొన్నారు. కృష్ణా, విజయనగరం జిల్లాలకు ఫిబ్రవరి నుంచి బిల్లులు, వేతనాలు చెల్లించలేదని, నెలల తరబడి ఇలా కొనసాగడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని రూరల్‌ ప్రాంతాల్లో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించబోమని, ఈ వర్కర్లనే కొనసాగిస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారని గుర్తుచేశారు. ప్రకాశం జిల్లాలో ఏక్తాశక్తి భోజనం బాగోలేదని అనేక ఫిర్యాదులొచ్చినా, ప్రభుత్వం దానిని ఇతర మండలాలకు విస్తృత పరుస్తోందని తెలిపారు. ఆ సంస్థ పథకానికి సంబంధించిన 175 బస్తాల బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చినా దానిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే ఏక్తా శక్తిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
జిల్లాల్లో పదిహేనేళ్లుగా పనిచేస్తున్న వర్కర్లను రాజకీయ కారణాలతో తొలగించి, తమ అనుయాయులను నియమిస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారిత గురించి చెప్పే ప్రభుత్వం ఉపాధి పోగొట్టే నిర్ణయా లతో వారిని అభద్రతకు గురిచేయడం సరైందని కాదని పేర్కొన్నారు. పిల్లలకు ఇచ్చే మెనూ ఛార్జీ పది రూపాయలు పెంచాలని, మౌలిక సదుపాయాలు కల్పించి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం ఐదు వేల రూపాయలను ప్రతి నెలా 5వ తేదీలోపు చెల్లించాలని కోరారు. ప్రభుత్వమే పాఠశాలలకు సబ్సిడీతో గ్యాస్‌ సరఫరా చేయడంతోపాటు వర్కర్లకు ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top