Friday, 18 Oct, 11.12 am ప్రజాశక్తి

పశ్చిమ గోదావరి
పెన్నాడలో గ్రామసభ రసాభస

ఇళ్ల స్థలాల అర్హులను
అనర్హులుగా గుర్తించారని ఆందోళన
అధికారులు డబ్బులు తీసుకున్నారని ఆరోపణ
రీ వెరిఫికేషన్‌కు తహశీల్దార్‌ ఆదేశం
వాయిదా పడిన గ్రామసభ
ప్రజాశక్తి - పాలకోడేరు
ఇళ్ల స్థలాల అర్హుల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు మండలంలోని పెన్నాడలో ఏర్పాటు చేసిన గ్రామ సభ రసాభసాగా మారింది. అధికారులపై అధికార పక్షం నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లబ్ధిదారుల ఎంపికకు అధికారులు డబ్బులు తీసుకుని అర్హుల జాబితాను మార్చి అనర్హులుగా గుర్తించారని ఆరోప ణలు చేశారు. ఎంపికలో అవకతవకలు జరిగాయని సిపి ఎం అధికారులను నిలదీసింది. ఈ నేపథ్యంలో లబ్దిదారుల జాబితాను రీ వెరిఫికేషన్‌ చేయాలని తహశీల్దార్‌ ఆదేశించారు. దీంతో గ్రామ సభ వాయిదా పడింది.
పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల జాబితా అభ్యంతరాలపై శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామసభకు పంచాయతీ కార్యదర్శి వసంతవాణి ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తహశీల్దార్‌ శ్యాంప్రసాద్‌ మాట్లాడారు. ఉగాది నాటికి అర్హులుగా ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇళ్ల స్థలం అందించనుందని చెప్పారు. దీనికి అవసరమైన స్థలాన్ని, లబ్దిదారుల, అర్హుల జాబితాను తయారు చేశామని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని తెలియజేశారు. 30 ఏళ్ల నుంచి గ్రామంలో నివాసం ఉంటున్నామని, తమకు ఎటువంటి ఆస్తులు లేవని, ఇళ్ల స్థలానికి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారని ఒక మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, చేతివృత్తి చేసుకుని జీవిస్తున్నానని, తనకు స్థలం కేటాయించలేదని ఓ వ్యక్తి ఆవేదన చెందాడు. సర్వేలు లేకుండా జాబితాను తయారు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధికారులు, గ్రామస్తులు, నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసు కుంది. ఒకానొక సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బిజెపి రాష్ట్ర నాయకులు కోరం ముసలయ్య మాట్లాడుతూ రూ.25 వేల నుంచి రూ.30వేలు డబ్బులు తీసుకుని ఇళ్ల స్థలాల లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. వాలంటీర్లు కూడా చేతివాటం ప్రదర్శించారని చెప్పారు. ఇదంతా పంచాయతీ కార్యదర్శి వసంతవాణి ప్రసాద్‌కు తెలిసే జరిగిందన్నారు. దళిత నాయకులు ఇట్టా రమేష్‌ మాట్లాడుతూ అర్హుల జాబితాలో ఎస్‌సిల పేర్లు లేవని అధికారులను ప్రశ్నించారు. ఎస్‌సి, ఎస్‌టిలకు నాలుగు, ముస్లిం సోదరులకు పది మందిని మాత్రమే అర్హులుగా చూపించారని, మిగిలినవారికి ఎవరికి రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచి ఇట్టా సురేష్‌బాబు మాట్లాడుతూ 600 మంది ఇళ్ల స్థలాలకు, ఇంటి నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్నారని, దీనిలో 375 మందిని అర్హులుగా చూపించారని చెప్పారు. ప్రస్తుతం కేవలం 150 మందిని మాత్రమే అర్హులుగా జాబితాను తయారు చేయడం దారుణమన్నారు. ఎంతోమంది ఎన్నో ఏళ్ల నుంచి ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్నారని, వారికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. వైసిపి గ్రామ ముఖ్య నాయకులు మంతెన సుబ్రహ్మణ్యంరాజు మాట్లాడుతూ 375 మంది ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోగా మొదట్లో వీరిని అర్హులుగా గుర్తించి ఇప్పుడు అనర్హులు అనడం ఏంటని ప్రశ్నించారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గ్రామస్తులు, నాయకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తహశీల్దార్‌ శ్యాంప్రసాద్‌ వారితో మాట్లాడి సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా వారు ఇచ్చిన నిబంధనలకు లోబడి ఇళ్లస్థలాల అర్హుల జాబితాను తయారు చేశామన్నారు. జాబితాపై అభ్యంతరం రావడంతో గతంలో ఉన్న 375 మంది జాబితాను రీ వెరిఫికేషన్‌ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. వెరిఫికేషన్‌ పూర్తయ్యాక గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దీంతో గొడవ సర్దు మణిగింది. ఈ నేపథ్యంలో గ్రామ సభ వాయిదా పడింది.
అవకతవకలు జరిగాయి : సిపిఎం
ఇళ్ల స్థలాలకు అర్హుల ఎంపికలో అవకతవ కలు జరిగాయని సిపిఎం నాయకులు అశ్రియ్య ఆరోపించారు. గ్రామసభలో ఇళ్ల స్థలాల సమస్యపై అధికారులను ప్రశ్నించారు. ఐదేళ్ల నుంచి జన్మభూమి, రచ్చబండ వంటి కార్యక్రమాల్లో గ్రామంలో అనేక మంది ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. తాజాగా అంతకు మించి దరఖాస్తులు వస్తే కేవలం 150 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడం దారుణమ న్నారు. అర్హుల ఎంపికలో ఎన్నో అవకతవకలు జరిగాయన్నారు. అర్హులుగా ఉన్న వారందరికి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే చూస్తూ ఊరుకోబోమని ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>