Friday, 18 Oct, 11.12 pm ప్రజాశక్తి

పశ్చిమ గోదావరి
పిచ్చిమొక్కల మధ్యలో పాఠశాల

విజృంభిస్తున్న దోమలు
రోగాల బారిన విద్యార్థులు
చూసీచూడనట్లు అధికారుల తీరు
ప్రజాశక్తి - గోపాలపురం
బదిర విద్యార్థుల మూగ రోదన పట్టించుకునేవారే లేరని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడివిని తలపించడంతో విద్యార్థులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నా పరిష్కారానికి కృషి చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని వాపోతున్నారు. ఆ పాఠశాల పరిధిలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండల ప్రజా పరిషత్‌ ఆవరణలో ఉన్న రాజీవ్‌ విద్యామిషన్‌ ఎస్‌ఎస్‌ఎ భవిత దివ్యాంగుల ప్రత్యేక వనరుల పాఠశాల 2013లో ప్రారంభించారు. ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మండలంలోని గ్రామాల నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులకు చదువుతోపాటు ఫిజియోథెరపీ, మెడికల్‌ క్యాంపులు, మానసిక ఉల్లాసం కలిగించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ విద్యార్థులకు భోజన సదుపాయంతోపాటు రాకపోకలకు రూ.మూడు వేలు, వీరి సహాయకులకు రూ.మూడు వేలు ప్రభుత్వం ద్వారా తమ ఖాతాలకు జమ అవుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బదిర విద్యార్థులకు వసతులు కల్పించడం పట్ల అభినం దనీయమే. కాని ఈ భవిత పాఠశాల చుట్టూ దట్టమైన అడవిని తలపిస్తూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో దోమలు పట్టపగలే స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ దోమల కాటుకు గురవుతున్న విద్యార్థులు జ్వరాలు, వ్యాధుల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పొదల నుంచి విషసర్పాలు కూడా వస్తున్నాయి.

మండల ప్రజా పరిషత్‌ ఆవరణలో భవిత స్కూల్‌తో పాటు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయం కూడా ఉంది. దీంతోపాటు ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం, హౌసింగ్‌ కార్యాలయం, డిఆర్‌డిఎ వెలుగు కార్యాలయం, ఎంజిఎన్‌ఆర్‌జిఎస్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. భవిత స్కూల్‌ పరిధిలోనే మండల అధికారుల కార్యాలయాలు ఉన్నప్పటికీ అధికారులు, ప్రత్యేకాధికారులు, ప్రజా ప్రతినిధులు వస్తున్నారే తప్ప తమ వైపు కన్నెత్తి చూడడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పరిసరాలను పరిశుభ్రం చేయించాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top