Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొగాకు రైతుల నిలువు దోపిడీ

పొగాకు రైతుల నిలువు దోపిడీ

- నిత్యం సగానికి పైగా బేళ్లు తిరస్కరణ- రోజురోజుకూ దిగజారిపోతున్న సగటు ధరలు
- వేలంలో కనిపించని పోటీ
-వ్యాపారుల సిండికేట్‌
- ఏ మాత్రమూ పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : పొగాకు రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. పొగ తాగడం తగ్గిస్తారనే పేరుతో పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీగా పన్నులు పెంచేసింది. ఫలితంగా సిగరెట్ల ధరలు భారీగా పెరిగాయి. కేంద్రం పొగాకు ఉత్పత్తులపై వ్యతిరేకంగా ఉందనే సాకుతో వ్యాపారులూ కొత్త ఎత్తులు వేస్తున్నారు. పొగాకు కొనుగోళ్లలో మాంద్యం సృష్టించారు. ధరలు లేవు. రోజురోజుకు వేలం తీరు ఆందోళనగా మారింది . రైతులు వేలం బహిష్కరించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వ్యాపారులు కొత్త పన్నాగం పన్నారు. మద్దతు ధరలు అడగకుండా ఉండటానికి తిరస్కరణను మార్గంగా ఎంచుకున్నారు. నిత్యం వేలంలో సగానికి పైగా బేళ్లను తిరస్కరిస్తూ కొనుగోళ్లలో సంక్షోభానికి తెరలేపారు. రైతులు ఇప్పుడు ధరలు అడిగే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రాలకు తెచ్చిన బేళ్లను కొంటే చాలనే భావనకు వచ్చేశారు. వ్యాపారులు ఐటిసి నేతృత్వంలో కేంద్రాల్లో సిండికేట్‌ అయ్యి సీలింగు ధరలు అమలు చేస్తున్నారు. వేలం ప్రారంభం నుంచీ గరిష్ట ధర కిలోకు రూ.250 మాత్రమే ఇస్తున్నారు. ఒక్క రూపాయి కూడా పెంచలేదు. గతేడాది కిలో రూ.300 దాటింది. గతేడాది ధరలు కూడా ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్నిటికంటే ఆందోళన చెందాల్సిన విషయమేమిటంటే రోజూ సగానికిపైగా బేళ్లను తిరస్కరిస్తున్నారు. వీటిని మళ్లీ కేంద్రాలకు తెచ్చి నెల రోజుల తర్వాతైనా అమ్ముకోవాల్సిందే. అప్పటి వరకూ వీటిని మళ్లీ జాగ్రత్తగా నిల్వ చేయాలి. అంటే, మళ్లీ కేంద్రానికి తెచ్చే లోపు నాణ్యత తగ్గుతుంది. ఇప్పుడున్న ధరలు కూడా రావు. రైతులు మరింత నష్టపోతారు. అందుకే ఎంతోకొంత ధరలకు వ్యాపారులు ఇప్పుడే కొంటే బాగుంటుందనుకునే పరిస్థితిలో రైతులు ఉన్నారు. వేలం ఇష్టారాజ్యంగా సాగుతోంది. పొగాకు బోర్డు ప్రేక్షకప్రాత వహిస్తోం ది. ధరలు పెంచేలా వ్యాపారులతో సంప్రదింపులు లేవు. పొగాకు రైతులతో వేసిన కమిటీల ప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదు. రైతు సంఘాల నేతలు కేంద్రాల్లోకి వెళ్లి ధరలపై ప్రశ్నిస్తున్నారు. దీన్ని నివారించేందుకు వ్యాపారులు కొత్త ఎత్తులు వేశారు. వేలంపై ఏం మాట్లాడాలన్నా కమిటీలదే బాధ్యత అని వ్యూహాత్మకంగా రైతులను ఇరికించారు. దీంతో, దోపిడీని ప్రశ్నించే పరిస్థితి లేకుండాపోయింది. వేలంలో ఏం జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కమిటీల ప్రతినిధులు
వాళ్ల పొగాకు బేళ్లు అమ్ముకుంటే చాలనుకుంటున్నారు. వ్యాపారుల మోసాలకు బోర్డు అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా, వ్యాపారులు బయట కొనుగోళ్లకు తెరలేపారు. కంపెనీలు వేలంలో కొంటే ఎక్కువ ధరలు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి పొగాకు కొనుగోలు చేస్తున్నారు. వాటినే కేంద్రాలకు తేవాలని సూచిస్తున్నారు. ఈ విధానం వల్ల వేలం పద్ధతి నిర్యీర్యమవుతోంది. సుబాబుల్‌ కొన్నేళ్లు మార్కెట్‌ కమిటీల ద్వారా కొనుగోలు జరిగింది. దాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఆ పద్ధతే లేకుండాపోయింది. ధరలు దిగజారిపోయాయి. సుబాబుల్‌ రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పుడు పొగాకు రైతులనూ ఇదే దారికి లాగుతున్నారు. శనివారం నాటి కొనుగోళ్లను పరిశీలిస్తే… తేలిక నేలల్లోని కేంద్రాల్లో 32.74 శాతం బేళ్లను వ్యాపారులు తిరస్కరించారు. పొదిలి -1 కేంద్రానికి 39 బేళ్లు రాగా, కేవలం 12 బేళ్లనే కొన్నారు. దీంతో రైతులు వేలం బహిష్కరించారు. కందుకూరు-2 కేంద్రానికి 116 బేళ్లు రాగా, 38 బేళ్లను మాత్రమే కొన్నారు. మిగతా వాటిని ఇంటికి పంపారు. కేంద్రాల్లో ఇప్పటి వరకూ 37.44 లక్షల కిలోల పొగాకు కొన్నారు. సగటు ధర రూ.235.52, గరిష్ట ధర రూ.250 ఉంది. నల్లరేగడి నేల ప్రాంతాల కేంద్రాల్లో 40.60 శాతం బేళ్లను తిరస్కరించారు. వెల్లంపల్లి కేంద్రంలో 159 బేళ్లను పెట్టగా, కేవలం 76 బేళ్లనే కొన్నారు. మంత్రి స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి కేంద్రంలో 402 బేళ్లను కొనుగోలుకు పెట్టగా, 204 బేళ్లను కొని మిగతా వాటిని తిరస్కరించారు. ఈ కేంద్రాలకు శనివారం 1,500 బేళ్లు రాగా, 891 బేళ్లను కొనుగోలు చేశారు. శనివారం సగటు ధర రూ.216.99 ఉంది. ఇప్పటి వరకూ 24.16 లక్షల కిలోల పొగాకు కొన్నారు. దీని సగటు ధర రూ.229.80 ఉంది. సగటు ధరలు పడిపోయేలా కొనుగోళ్లు నడుస్తున్నాయి. సగటు ధర ఎంత వస్తుందనే దానిపైనే రైతులకు లాభమా? నష్టమా? అనేది తేలనుంది. పోటీ అనే మాటే లేదు. వ్యాపారులపై ఒత్తిళ్లు లేవు. ఇటీవల టంగుటూరులోని వేలం కేంద్రాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆ పార్టీ జిల్లా నేతలతో కలిసి సందర్శించారు. వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలకు నిధులు కేటాయించి వేలంలో కొనుగోళ్లు చేట్టాలని సూచించారు. వైసిపి నేతలూ సందర్శిస్తున్నారు. వేలం తీరుపై ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. అయితే, ఇంతవరకూ మంత్రులుగానీ, పాలకపక్ష ఎమ్మెల్యేలుగానీ వేలం కేంద్రాలను సందర్శించిన దాఖలాల్లేవు. పొగాకు రైతులను పూర్తిగా వదిలేశారు. ఇప్పుడున్న సంక్షోభాల్లో ఇదొకటి అన్నట్టుగా వారు ఉన్నారు. తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని పొగాకు రైతులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti