- కోసిగి ఆర్టీసీ బస్టాండ్ లో మౌలిక సదుపాయాలతో పాటు మైనర్ రిపేర్లు చేయిస్తాం
ప్రజాశక్తి-కోసిగి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మైనర్ రిపేర్లు చేయించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆదోని డిఎం రెహమాన్ అన్నారు.
గురువారం ప్రజాశక్తి దినపత్రికలో ఆర్టీసీ బస్టాండ్ నిండా సమస్యలే అన్న వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే. పత్రికలో వచ్చిన వార్తపై ఆదోని డిఎం రెహమాన్ స్పందించారు. గురువారం సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్టాండ్, చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. బస్టాండ్ లో ఉన్న సమస్యలను గుర్తించి జిల్లా అధికారులకు నివేదికను పంపి త్వరలో పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యార్థం కూర్చోడానికి కుర్చీలు , మౌలిక సదుపాయాలు సహా ఇతర చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయిస్తామన్నారు. అదేవిధంగా బస్టాండ్ పరిసరాల్లో ప్రైవేటు వ్యక్తులు సంచరించడం, రాత్రిపూట మద్యం సేవించడం వంటి చర్యలతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనధికారికంగా వాహనాలు పార్కింగ్ చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

