Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ గౌరవం

ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ గౌరవం

- రాష్ట్రానికి "ఫుడ్ ప్లానెట్ ప్రైజ్-2026" వరించడం అభినందనీయం : డిపిఎం ప్రజాశక్తి-కడప అర్బన్ : ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ "ఫుడ్ ప్లానెట్ ప్రైజ్-2026" పురస్కారం లభించడం పట్ల వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్.వి.

ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిర ఆహార వ్యవస్థల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించాలనే లక్ష్యంతో స్వీడన్‌కు చెందిన కర్ట్ బర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ అందజేసే ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పర్యావరణ పురస్కారాలలో ఒకటని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజా ఉద్యమంగా మలిచిన రైతులు, మహిళా రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, గ్రామస్థాయి నాయకత్వం కృషికి ఈ అవార్డు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం రాష్ట్రానికే కాకుండా దేశానికీ గర్వకారణమన్నారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, రైతు సాధికార సంస్థ గౌరవ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు టి.విజయ్ కుమార్‌లకు అభినందనలు తెలిపారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా ఆచరిస్తూ నేల ఆరోగ్య పరిరక్షణ, రైతు ఆదాయ వృద్ధి, పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్న మహిళా రైతులు, రైతు మిత్రులు, మాస్టర్ ట్రైనర్లు, సిబ్బంది, అధికారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆహార ఉత్పత్తులు సాధ్యమవుతున్నాయని, నేల సారవంతత పెరగడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యం రైతులకు పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ పురస్కారం సుస్థిర వ్యవసాయం, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆంధ్రప్రదేశ్ నిబద్ధతకు ప్రపంచం ఇచ్చిన గొప్ప గుర్తింపని ఎస్.వి. ప్రవీణ్ కుమార్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti