ప్రపంచ అథ్లెటిక్స్ రంగంలో మన భారతదేశం ముద్ర చాలా స్వల్పం. చైనా, రష్యా, అమెరికా, కొరియా దేశాల అథ్లెట్లు చేసే విన్యాసాలు చూసి ఆశ్చర్యపోతాం. పతకాల పట్టికలో మన దేశ పరిస్థితి చూసి నిరాశపడతాం.
అగ్రదేశాలైన అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలను పక్కనపెడితే మన కంటే చిన్న దేశాలైన కెన్యా, క్యూబా, జమైకా, ఇథోయోపియా వంటి దేశాలు ప్రపంచ అథ్లెటిక్స్ రంగంలో విజృంభిస్తుండటం మన మీద మనకే జాలి కలిగిస్తోంది.మే7న ప్రపంచ అథ్లెటిక్స్ డేను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ ఎక్కడ ఉందనే అంశాన్ని చర్చించుకోవాలి. ఈ సందర్భంగా అథ్లె టిక్స్ పై కథనం.
మన దేశం గురించి మనం ఎంతగొప్పగా చెప్పుకుంటున్నా, మనం ఇంకా అనేక రంగాల్లో చాలా వెనుకబడే ఉన్నాం. వాటిలో ముఖ్యమైనది అథ్లెటిక్స్. అథ్లెటిక్స్‌లో మన పరిస్థితి తెలియజేయడానికి ఒక్క ఉదాహరణ ఏమిటింటే.. భారత్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అది ప్రారంభమైన ఏడాది నుంచి, అంటే1983 నుంచి పోటీ పడుతుంది. కానీ ఈ టోర్నీలో బోణీ చేయడానికి భారత్‌కు 20ఏళ్లు పట్టింది. 2003లో అంజూ బాబీ జార్జ్ మహిళల లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించి, భారత్ ఖాతా ప్రారంభించింది. ఈ తర్వాత మళ్లీ ఈ టోర్నీలో బంగారు పతకం సాధించడానికి భారత్‌కు మరో 20ఏళ్లు పట్టింది. 2023లో పురుషుల జావెలన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. దీనికి ముందు ఏడాది అంటే 2022 ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా రజితం సాధించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాలు ఈ మూడే. 43 ఏళ్ల ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ స్థితి ఇది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను ప్రతి రెండేళ్లకు నిర్వహిస్తారు. కానీ కోవిడ్ మహ్మమ్మారి కారణంగా2021లో జరగాల్సిన టోర్నీని 2022లో నిర్వహించారు. వచ్చే21వ ఎడిషన్‌ను 2027లో చైనాలో నిర్వహించనున్నారు. రానున్న ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రదర్శనపై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. మరో ప్రముఖ టోర్ని ఒలింపిక్స్‌లోనూ ముఖ్యమైన అథ్లెటిక్స్ విభాగంలో భారత్ పరిస్థితి అందరికీ తెలిసిందే. క్రీడల్లో కీలకమైన అథ్లెటిక్స్‌లో మనం ఇంతగా వెనకబడ్డానికి, మన కన్నా చిన్నదేశాలు మెరుగైన ప్రదర్శన చేయడానికి అనేక కారణాలు ఉన్నా.. ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం,నిధుల కొరత. పేలవమైన పరిపాలన నిర్వహణ క్రీడల్లో, అథ్లెటిక్స్‌లో మనం వెనకబడ్డానికి ముఖ్య కారణాలు. దేశంలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయిల్లో అథ్లెట్లకు సంబంధించిన శిక్షణా సౌకర్యాలు, నాణ్యమైన కోచింగ్, పరికరాలు లేక అసలు ఈ రంగంలోకి రావడానికే చిన్నారులు, యువత ఇష్టపడ్డం లేదు. కొందరు ఇబ్బందులు దాటి ఈ రంగంలోకి వస్తున్నా.. అవినీతి, రాజకీయ జోక్యం, ఎంపికల్లో పక్షపాతం, ధనప్రభావం, వేధింపులు, క్రీడా సంఘాల్లో సమస్యలు వంటి కారణాలతో దేశంలోని అనేక మంది ప్రతిభావంతులు మట్టిలో మాణిక్యాలు గానే మిగిలి పోతున్నారు. అలాగే ఒక ప్రముఖ విదేశీ మీడియా సంస్థ పరిశోధన ప్రకారం పేదరికం, ఆహారం లేదా సరైనా పోషకాహారం లేకపోవడం, తగిన శిక్షణ, ఆర్థిక వనరులు లేకపోవడం వంటి కారణాలు భారత్‌లో ప్రతిభావంతమైన క్రీడాకారులు అంతర్జాతీయ ప్రమాణాలను సాధించకుండా నిరోధిస్తున్నాయి. క్రీడలు, అథ్లెటిక్స్‌పై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఈ సంస్థ ప్రముఖంగా ప్రస్తావించింది. అలాగే, దేశంలో క్రికెట్ ఏకస్వామ్యం నడుస్తోందని, క్రీడ అంటే క్రికెట్ అనే భావన ప్రబలంగా ఉందని తెలిపింది. నిధులు, మీడియా దృష్టి, ప్రజాదరణ వంటి విషయాల్లో క్రికెట్ భారీ ఆధిపత్యం చెలాయిస్తూ ఇతర క్రీడలు ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో భారత్ కనీస స్థాయిని కూడా చేరకుండా నిరోధిస్తుందని తెలిపింది. అలాగే, దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు,కళాశాలల్లో ఆట స్థలాలు, సరైన శిక్షణ, సౌకర్యాలు, పరికరాలు లేకపోవడం వంటి ప్రాథమిక సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. అసలు పాఠశాలల్లో క్రీడా మైదానాలే లేకుంటే విద్యార్థులకు క్రీడలు, అథ్లెటిక్స్‌పై ఆసక్తి ఎలా కలుగుతుందని ప్రశ్నించాయి. చిన్న వయస్సులోనే ప్రతిభను గుర్తించడంపై అథ్లెటిక్స్‌లో రాణించడం ప్రధానంగా ఆధారపడి ఉంటుందని తెలిపాయి. ఈ రెండు నివేదికలు మాత్రమే కాదు, దాదాపు దేశంలోని క్రీడా పరిస్థితిపై చేసిన అన్ని అధ్యయనాలు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వెల్లడించాయి. భారత్‌లో క్రీడల్లో రాణించాలని అనుకొనేవారు ప్రభుత్వ మద్దతు,ప్రోత్సాహం కన్నా కుటుంబ, వ్యక్తిగత మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని తెలిపాయి. దేశంలో క్రీడల అభివృద్ధికి పరిపాలనా అసమర్థత అతిపెద్ద అడ్డంకుల్లో ఒకటిగా ఉందని తెలిపాయి. పరిపాలనలో లోపాలు, సమస్యలు క్రీడాకారులను తరచుగా నిరుత్సాహపరుస్తున్నాయని వెల్లడించాయి. అంతర్జాతీయ ఈవెంట్ల సమయంలో నిధుల విడుదల్లో జాప్యం, ఎంపికలో పక్షపాతం, తగినంత మద్దతు లేకపోవడంపై అథ్లెట్లు అనేకసార్లు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయని నివేదికలు గుర్తుచేశాయి.
విజయవంతమైన దేశాల్లో..
అథ్లెటిక్స్ రంగంలో విజయవంతమైన దేశాల్లో పైన చెప్పుకున్న పరిస్థితులకు విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. చైనా, రష్యా, అమెరికా, బ్రెజిల్, కెన్యా వంటి దేశాలను అగ్రశ్రేణి క్రీడా దేశాలుగా పరిగణిస్తారు. ఇక్కడ క్రీడలకు బలమైన సాంస్కృతిక ప్రాధాన్యత ఉంటుంది. క్రీడలకు అధిక నిధులు కేటాయించడం, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, ప్రతిభను ముందుగానే గుర్తించడం, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలు వంటి వాటితో క్రీడల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అమెరికా, చైనా, జర్మనీ వంటి సంపన్నదేశాలు శిక్షణ, మౌలిక సదుపాయాలు, కోచింగ్‌పై భారీగా పెట్టుబడులు పెడతాయి.ఇక బ్రెజిల్ (ఫుట్‌బాల్), కెన్యా(రన్నింగ్), క్యూబా (బాక్సింగ్) వంటి దేశాలకు ఒక నిర్దిష్ట క్రీడల పట్ల లోతైన సాంస్కృతిక వారసత్వం, సామాజికంగా విపరీతమైన అభిమానం ఉంటాయి. చైనా,రష్యా దేశాల్లో ప్రత్యేక ప్రతిభ, అభివృద్ధి వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ యువ ప్రతిభను గుర్తించి, శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలను ఉపయోగి స్తాయి. అలాగే, కెన్యా, ఇథియోపియా వంటి దేశాలు క్రీడల్లో ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో రాణించడానికి తమ భౌగోళిక పరిస్థితులను ఉపయోగించు కుంటాయి.
సోషలిస్టు దేశాల్లో…
చైనా, రష్యా వంటి సోషలిస్టు దేశాలు క్రీడలు, అథ్లెటిక్స్‌లో రాణించడానికి తమకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని అమలు చేసుకుంటున్నాయి. క్రీడలను ఆటవిడుపు లేదా విశ్రాంతి కార్యకలాపంగా మాత్రమే కాకుండా, ఆరోగ్యం, రక్షణ కోసం ప్రజల సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, జాతీయభావాన్ని పెంపొందించడానికి క్రీడాలను ఇక్కడ ఒక సాధనంగా ఉపయోగించుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడ క్రీడా వ్యవస్థలను ప్రభుత్వ యంత్రాంగంలో పూర్తిగా విలీనం చేశారు. వీటిల్లో రాజకీయ జోక్యానికి తావుండదు. స్వతంత్ర క్రీడా క్లబ్‌లను రద్దు చేసి, వాటి స్థానంలో ప్రభుత్వ నిర్వహణ సంస్థలను ఏర్పరిచారు.
అంతర్జాతీయ స్థాయిలో విజయాలను గరిష్ట స్థాయిలో చేర్చడానికి కొన్ని క్రీడలను కేంద్రంగా చేసుకుని, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇక క్రీడలను అంతిమంగా ప్రజల్లో క్రమశిక్షణను పెంచడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడానికి, కార్మికుల ఉత్పాదకతను పెంచడానికి, ఫిటెనెస్ సంస్కృతిలో సామూహిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వాలు ఉపయోగించుకున్నాయి.
ముఖ్యంగా రష్యా 'పనిచేయగల, తమను తాము రక్షించుకోగల ఆరోగ్యకరమైన పౌరులు'ను తయారుచేసే లక్ష్యంతో క్రీడావిధానాన్ని రూపొందించింది. కేవలం పాఠశాలలు, క్రీడా సంఘాల్లో మాత్రమే కాకుండా ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో ప్రొడక్షన్ జిమ్నాస్టిక్స్‌ను ప్రవేశపెట్టారు. చైనా,పోలాండ్ వంటి దేశాలలో ఇలాంటి పద్ధతులనే అమలు చేస్తున్నాయి.
కెన్యా ఇటీవల తీసుకొచ్చిన ఒక చట్టం ప్రకారం క్రీడా సంఘాల్లో ఆర్థిక దుర్వినియోగాన్ని ఆరికట్టడానికి ఒక జాతీయ క్రీడా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. అలాగే ఈ చట్టం ప్రకారం క్రీడాకారుల హక్కులను పరిరక్షించడానికి, సంక్షేమాన్ని మెరుగుపర్చడానికి, లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేశారు. క్రీడాసంస్థలో కఠినమైన ఆర్థిక తనిఖీలను అమలుచేయడం, సమాఖ్యల్లో పదవుల పదవీకాలాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. క్యూబాలో క్రీడను ఒక హక్కుగా పరిగణిస్తారు. తప్పనిసరి శారీరక విద్య, ప్రత్యేకమైన క్రీడా పాఠశాలల్లో ఇక్కడ అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో కూడిన శిక్షణ క్యూబా ప్రత్యేకత. అలాగే క్యూబాలో ఒక ప్రత్యేక ప్రతిభను గుర్తించే వ్యవస్థ ఉంది. ఇది అత్యంత వ్యవస్థీకృతమై క్రీడా సామర్థ్యం ఉన్న పిల్లలను గుర్తించి, వారిని ప్రత్యేక శిక్షణా అకాడమీల్లో చేరుస్తుంది.
క్యూబా అవసరమైన దేశాలకు వైద్యులను పంపుతుందని చాలా మందికి తెలుసు. కానీ క్రీడా కోచ్‌లను కూడా పంపుతుందని కొద్దిమందికే తెలుసు. పైన తెలిపిన ప్రత్యేక వ్యవస్థల ద్వారానే క్యూబా ఈ ఘనతను సాధించింది.
పిటి ఉషలా.. అనేంత పేరొందారు..
పిటి ఉషా నిజానికి తన కెరీర్‌లో ఒలింపిక్స్ వంటి భారీ టోర్నిలో పతకాలు సాధించలేదు. కానీ దేశీయ అథ్లెటిక్స్ రంగంలో ఆమె ప్రభావం, స్ఫూర్తి తిరుగులేనివి. ఇవి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. ఆమె కెరీర్ వదిలిపెట్టి కొన్ని దశాబ్ధాలు గడిచిన తరువాత కూడా ఇప్పటికీ ఎవరైనా బాగా పరుగుపెడుతుంటే పిటి ఉషాలా పరుగుపెడుతున్నావనే అంటారు. కొన్ని తరాల నుంచి భారతీయ క్రీడాకారులకు, ముఖ్యంగా మహిళలకు, మరీ ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోని వారికి స్ఫూర్తిగా ఉంటుంది. పరుగు పందెంలో పాల్గొనే మహిళల గురించి దేశం ఆలోచించే విధానాన్ని పిటి ఉష మార్చిదంటే అతిశయోక్తి కాదు. కెరీర్ తర్వాత ఉషా రాజకీయల్లో ప్రవేశించి భారత ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
బాక్సింగ్‌లో మేరికోమ్..
మేరీకోమ్ సాధించిన విజయాలు ఆమెకే కాదు.. మనదేశానికే గర్వకారణం.ప్రపంచ ఆమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆరుసార్లు గెలిచిన ఏకైక మహిళ.అలాగే,తన మొదటి ఏడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల్లో ప్రతీదానిలోనూ పతకాలు సాధించిన ఏకైక మహిళా బాక్సర్. మణిపూర్‌లో పుట్టిన తను అక్కడ యువకులు బాక్సింగ్‌లో రాణించడం చూసి తాను కూడా ఈ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. క్రమక్రమంగా ఎదిగి, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. అథ్లెటిక్స్‌లో కఠినమైన, తీవ్రమైనదిగా పేర్కొనే బాక్సింగ్‌లో మేరికోమ్ విజయాలు అనేకమంది భారతీయ బాలికలు ఆ రంగం వైపు వెళ్లడానికి స్ఫూర్తిగా మారాయి.
జావెలిన్ త్రోలో నీరజ్‌చోప్రా..!
భారత్ నుంచి సంచనాలు సృష్టిస్తున్న నీరజ్‌చోప్రా అథ్లెటిక్స్‌లో మనకు ఆశాకిరణం. 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుని అథ్లెటిక్స్ రంగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కోచ్‌ల సహాకారంతోనే ఈ విజయాన్ని సాధించానని చెప్పడం అతని గొప్పతనం. తన ఒలింపిక్స్ విజయాన్ని మిల్ఖా సింగ్, పిటి ఉషలకు అంకితం చేశాడు. వచ్చే ఒలింపిక్స్, అథ్లెటిక్స్ ఛాంపియన్‌ల్లో రాణించడంపై దృష్టిపెట్టాడు. ఇతని ప్రభావంతో జావెలిన్ త్రోకు దేశంలో మరింత ఆదరణ లభిస్తుందంటే అతిశయోక్తికాదు.
అథ్లెటిక్స్‌లో అవగాహన ఉండాలి!
అవగాహన ఉన్న అందరికీ అథ్లెటిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాకింగ్ నుంచి రన్నింగ్, రేసింగ్, జంపింగ్, థ్రోయింగ్, జమ్నాస్టిక్స్ వరకూ అన్ని కూడా అథ్లెటిక్స్ కిందకే వస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే వ్యాయామ, శారీరక శ్రమతో కూడిన క్రీడా ఈవెంట్ల సమూహమే అథ్లెటిక్స్. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ వంటి క్రీడల్లో రాణించాలంటే అథ్లెటిక్స్‌లో అనుభవం ఉండాలి. అథ్లెటిక్స్‌లో అవగాహనే మిగిలిన క్రీడల్లో రాణింపునకు తొలిమెట్టు. ఇలాంటి కీలకమైన అథ్లెటిక్స్‌కు మరింత ప్రాచుర్యం, ప్రాముఖ్యత కల్పించడానికి ప్రతిఏటా మేలో ప్రపంచ అథ్లెటిక్స్ డేను వరల్డ్ అథ్లెటిక్స్ (గతంలో ఐఎఎఎఫ్) నిర్వహిస్తోంది. ప్రజల్లో ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీపై అవగాహన పెంచడం, యువతను క్రీడల వైపు మళ్లించడం వంటి ప్రధాన లక్ష్యాలతో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ ఏడాది థీమ్..
ఈ ఏడాది మే 7న ఈ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది థీమ్‌గా 'స్పోర్ట్స్: వారథులను నిర్మించడం, అడ్డంకులను ఛేదించడం'అని ప్రకటించారు. క్రీడల ద్వారా ఐక్యతను ప్రోత్సహించడం, అందర్నీ కలుపుకొని పోవడాన్ని ప్రోత్సహించడం, సామాజిక, భౌతిక అడ్డంకులను ఛేదించడం, యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యాలు.
కోవిడ్ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా తగ్గిన క్రీడా కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించే ప్రాముఖ్యతతో దీన్ని నిర్వహించనున్నారు.
భారత్‌లో దీన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించనుంది. వరల్డ్ అథ్లెటిక్స్ డే చరిత్ర ప్రతి ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ డేను ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఎఎఎఫ్) నిర్వహిస్తోంది. నిజానికి ఐఎఎఎఫ్‌ను 1912లో స్థాపించినా ఈ వరల్డ్ అథ్లెటిక్ డేను మాత్రం 1996 నుంచి నిర్వహిస్తున్నారు. ఐఎఎఎఫ్ ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి, అథ్లెటిక్స్‌కు ప్రపంచవ్యాప్త పాలన నిర్మాణాన్ని అందించడానికి దీన్ని ప్రారంభించారు. 1996లో అప్పటి ఐఎఎఎఫ్ అధ్యక్షులు ప్రిమో నెబియోలో ఈ అథ్లెటిక్స్ డేను ప్రారంభించారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో ఈ డే కు అంకురార్పణ చేస్తున్నట్లు అప్పట్లోనే నెబియోలో తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అథ్లెటిక్స్ గురించి అవగాహనను పెంచడం, ప్రపంచ వ్యాప్తంగా యువతను క్రీడల్లో పాల్గొనేలా ప్రేరేపించడం.. అథ్లెటిక్స్ డేకు ప్రధాన లక్ష్యాలని తెలిపారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ డేను నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా క్రీడాసంఘాలు, పాఠశాలలు, కళాశాలలు వద్ద ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఎఎఎఫ్) 1996 తర్వాత రెండుసార్లు పేరు మార్పునకు గురయింది. 2001లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్‌గా మార్చారు. మళ్లీ 2019లో దీన్ని వరల్డ్ అథ్లెటిక్స్‌గా మార్చారు. అలాగే, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిన్‌ను కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వరల్డ్ అథ్లెటిక్స్ డే ప్రాధాన్యత, ప్రాముఖ్యత కూడా పెరిగింది.
ఈ దినోత్సవం కేవలం ఉన్నతస్థాయి ప్రదర్శనను గుర్తించడానికి పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత క్రీడలను స్వీకరించడానికి, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి, తమ సామర్థ్యాలు ఏమిటో తెలుసుకోవడానికి ఒక పిలుపు మాదిరిగా ఉపయోగపడాలని వరల్డ్ అథ్లెటిక్స్ కోరుకుంటుంది.ఈ రోజు రికార్డులు, పతకాలకు అతీతమైనవి. దిగ్గజాల వారస్వత్వాన్ని గౌరవించడానికి, కొత్త కలలను రగిలించడానికి, మరింత ఆరోగ్యకరమైన, మరింత శక్తివంతమైన తరానికి బాటను అందిస్తుంది.
- వై విశ్వప్రసాద్ 9704882574

