Dailyhunt
ప్రయోగ శైలిలో కథాదృశ్యం!

ప్రయోగ శైలిలో కథాదృశ్యం!

తెలుగు కథా సాహిత్యంలో ఆధునికతను, అంతర్జాతీయ కథా ధోరణులను దేశీయీకరించి, సామాజిక వాస్తవికతకు అద్భుత వాస్తవికతను అద్దిన అరుదైన కథకుడు ఎమ్మెస్ సూర్యనారాయణ.

ప్రపంచ సాహిత్యంలో ఫ్రాంజ్ కాఫ్కా ప్రవేశపెట్టిన 'అబ్సర్డిటీ', గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ పండించిన 'మ్యాజిక్ రియలిజం' వంటి ప్రక్రియలను కేవలం పాశ్చాత్య పరిభాషలుగా మిగిల్చివేయకుండా, మన తెలుగు నేల మీది ఆకలికి, రాజకీయ వ్యవస్థలోని కుళ్లుకు, పర్యావరణ విధ్వంసానికి అన్వయించి ఒక సరికొత్త 'దేశీయం' చేసిన ఘనత ఆయనది. ఎమ్మెస్ కథలు కేవలం వర్తమాన చిత్రణలు కావు; అవి రాబోయే కాలం పట్ల చేసే 'డిస్టోపియన్' హెచ్చరికలు. మానవీయ విలువల పతనాన్ని, ఆహార సంక్షోభాన్ని, యాంత్రీకరణలో మనిషి కోల్పోతున్న ఉనికిని ఆయన తన కథా శిల్పం ద్వారా అత్యంత పదునుగా ఆవిష్కరించారు. ఆయన కథల్లో వస్తువు ఎంత వైవిధ్యంగా ఉంటుందో, దాన్ని చెప్పే సంవిధానం అంతకంటే వినూత్నంగా ఉండి పాఠకుడిని ఒక వింత అనుభూతికి, లోతైన ఆలోచనకు గురి చేస్తుంది.
ఎమ్మెస్ సూర్యనారాయణ కథా వస్తువుల్లో ప్రధానంగా మధ్య తరగతి వైఫల్యం, ఆర్థిక అసమానతలు, పర్యావరణ స్పృహ కనిపిస్తాయి. 'అద్భుతరావు నవ్వు' కథను పరిశీలిస్తే, అందులో హాస్యం వెనుక దాగి ఉన్న భయంకరమైన విషాదాన్ని గమనించవచ్చు. ఒక ఆహ్లాదకరమైన సాయంత్రం, తీపి పాయసం, కుటుంబ సభ్యుల నవ్వుల మధ్య ప్రారంభమయ్యే ఈ కథ, ఒక్కసారిగా గడియారం పగిలిపోవడంతో నిశ్శబ్దంలోకి జారిపోతుంది. ముప్పై ఏళ్ల శ్రమ, గ్రేట్యూటీ డబ్బులు, జీవితాంతం పడిన కష్టం శూన్యమైపోయిన స్థితిలో ఒక మధ్య తరగతి వ్యక్తి తీసుకునే తీవ్ర నిర్ణయం ఇక్కడ వస్తువు. రచయిత ఇక్కడ 'తీపి'ని మరణానికి వాహకంగా వాడటం ద్వారా ఒక రకమైన షాక్ ట్రీట్‌మెంట్‌ను పాఠకుడికి ఇస్తారు. "ఆ ఇల్లు పాయసం తాగింది" వంటి ప్రయోగాలు కథకు ఒక మర్మ రూపాన్ని ఇస్తాయి. పైకి నవ్వుతూ కనిపించే మనుషుల మనసుల్లో ఎంతటి ఆవేదన, హింసాత్మక ఆలోచనలు దాగి ఉన్నాయో అబ్సర్డ్ శైలిలో చెప్పడం ఈయన ప్రత్యేకత.
శారీరక వేదనను జీవన సత్యంతో ముడిపెట్టడం ఎమ్మెస్ శైలిలో మరో కోణం. 'గోరుచుట్టు' కథలో నొప్పిని కేవలం ఒక అనారోగ్యంగా కాకుండా, మనిషిని ముట్టడించే ఒక యుద్ధంగా వర్ణించారు. "నొప్పి ఇంద్రజిత్తులా మాయాయుద్ధం చేస్తోంది" వంటి ఉపమానాలు నొప్పి యొక్క తీవ్రతను దృశ్యమానం చేస్తాయి. ఈ కథలో 'ఆపదరావు' అనే పాత్ర ద్వారా సమాజంలోని ఒక రకమైన మనస్తత్వాన్ని ఎండగట్టారు. సహాయం చేసే నెపంతో భయాన్ని పెంచే వ్యక్తులు మన చుట్టూ ఎలా ఉంటారో, చివరకు వద్దనుకున్న వ్యక్తుల సహాయం మీదనే మనిషి ఎలా ఆధారపడవలసి వస్తుందో ఈ కథలోని ఐరనీ ద్వారా వెల్లడవుతుంది. నొప్పి లేని సమయంలో వచ్చే నిశ్శబ్దాన్ని 'వెయిటింగ్ ఫర్ పెయిన్' అనడం మనిషిలోని నిరంతర ఆందోళనను సూచిస్తుంది. ఇక్కడ 'బ్లాక్ హ్యూమర్'ను వాడుతూ, జుగుప్సను కూడా ఒక తాత్విక కోణంలో రచయిత ఆవిష్కరించారు.
రాజకీయ వ్యవస్థలోని కుళ్లును ఎండగట్టడానికి ఎమ్మెస్ 'సర్రియలిజం', 'పొలిటికల్ సెటైర్'ను ఆశ్రయిస్తారు. 'శవరావు' కథలో ఒక చనిపోయిన వ్యక్తి ఆత్మగా మారి తన హంతకుడిని గమనించడం, ఆ నాయకుడు ముఖానికి రకరకాల 'తొడుగులు' మార్చుకోవడం వంటివి అద్భుత వాస్తవికతకు నిదర్శనాలు. రాజకీయ నాయకుల నైతిక పతనాన్ని సూచించడానికి వారిని 'శవాలు'గా వర్ణించడం పదునైన వ్యంగ్యం. "ఒక శవం అనర్గళంగా ఉపన్యసిస్తోందని ఎవరూ గుర్తు పట్టరు" అన్న వాక్యం వ్యవస్థలోని నిస్సహాయతను, అంధత్వాన్ని ఎత్తిచూపుతుంది. తెల్లటి ఒంటెను విదేశీ పెట్టుబడిదారీ వ్యవస్థకు సంకేతంగా వాడటం ద్వారా అంతర్జాతీయ పరిణామాలను కూడా కథలోకి సమర్థవంతంగా తీసుకువచ్చారు.
వస్తు ప్రతీకాత్మకత ఎమ్మెస్ కథా సంవిధానంలో ఒక ప్రధాన అంగం. 'ముఖచిత్రం' కథలో ఒక టిఫిన్ బాక్స్ తన ఆత్మకథను చెప్పుకోవడం వినూత్నమైన ప్రయోగం. ఆకలిని తీర్చాల్సిన పాత్ర, విధ్వంసకర శక్తుల చేతుల్లో బాంబుగా మారి 'రక్త చరిత్ర'ను ఎలా లిఖిస్తుందో ఇందులో వివరించారు. అమాయకపు వస్తువులు మృత్యు ముఖాలుగా మారుతున్న వైనాన్ని టిఫిన్ బాక్స్ గొంతుకతో చెప్పించడం వల్ల పాఠకుడికి హెచ్చరిక అందుతుంది. అలాగే 'చక్రవర్తి' కథలో 'కుర్చీ' అనేది కేవలం ఫర్నిచర్ కాదు, అది మనిషి సోమరితనానికి, బాధ్యతారాహిత్యానికి ప్రతీక. సమాజంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా తన సౌకర్యానికి అతుక్కుపోయిన సగటు మనిషిని 'ప్రేక్షక చక్రవర్తి'గా అభివర్ణించడం ద్వారా పాఠకుడి అంతరాత్మను రచయిత తట్టి లేపుతారు. ఇక్కడ పారిజాతం అనే పాత్ర శ్రమజీవి అయిన సామాన్య స్త్రీకి, గృహిణి పడే కష్టానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. పర్యావరణ విధ్వంసాన్ని, ప్రకృతికి మనిషికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని 'నాగరిక చితి' కథలో అత్యంత ఉద్వేగభరితంగా చిత్రించారు. వరిపైరు, పాలపిట్ట, పులిబిడ్డ మధ్య సాగే సంభాషణలు కథకు ఒక అద్భుతమైన ఊహాశక్తిని ఇస్తాయి. అడవిని ఆక్రమించుకున్న మనుషుల వల్ల ఆకలితో ఊరిమీదకు వచ్చిన పులిబిడ్డను క్రూరంగా చంపడం, ఆ రక్తం వరిచేనును తడపడం వంటి వర్ణనలు పాఠకుడిని ఉలిక్కిపడేలా చేస్తాయి. "పులిని చంపడం అంటే మనిషి తన సొంత వినాశనానికి చితి పేర్చుకోవడమే" అన్న సందేశం ఇక్కడ బలంగా వినిపిస్తుంది. ప్రకృతి సహనానికి వరిపైరును, అంతరించిపోతున్న అరణ్య రాజసానికి పులిబిడ్డను ప్రతీకలుగా వాడి, ఆహార గొలుసు విచ్ఛిన్నం కావడాన్ని రచయిత కళ్లకు కట్టారు.
శ్రమ సౌందర్యాన్ని, ఆశయాల శాశ్వతత్వాన్ని చాటిచెప్పే 'మంచు శిల్పం' కథ ఎమ్మెస్ లోని తాత్విక కోణాన్ని ఆవిష్కరిస్తుంది. రాజప్రసాదాలు, సింహాసనాలు వంటి అధికార చిహ్నాల కంటే, నాగలి పట్టిన రైతు శిల్పమే గొప్పదని వృద్ధ శిల్పి ద్వారా చెప్పించారు. సూర్యుడి వేడికి మంచు కరిగినా, ఆ శ్రమ వల్ల పుట్టే ఫలం భూమిలో ఇమిడిపోయి కొత్త జీవానికి కారణమవుతుందనే సత్యం ఇందులో ఉంది. బాహ్యమైన రూపం నశించినా, మనిషి ఆశయం, కష్టం నిరంతరం ఉంటాయని చెప్పడానికి 'మంచు'ను ఒక స్వచ్ఛమైన ప్రతీకగా వాడారు. అదే సమయంలో 'నదిని మళ్లించిన చేతులు' వంటి కథల్లో ఎటువంటి మ్యాజిక్ రియలిజం లేకుండా, అత్యంత సహజమైన యథార్థవాదంతో సామాన్యుడి అసాధారణ కృషినీ, అవార్డుల వెనుక ఉన్న రాజకీయాలనూ ఎండగట్టారు. ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో మనిషి పడే అవస్థలను 'చిదంబర స్వప్నం' కథలో అబ్సర్డ్ శైలిలో చిత్రీకరించారు. ఆకలిని ఒక కలగా మార్చడం, ఉల్లిపాయలను వజ్రాల లెక్కన చూడాల్సి రావడం వంటివి మధ్యతరగతి దీనస్థితికి అద్దం పడతాయి. సాంకేతికత ఎంత పెరిగినా మనిషి ఆకలి తీరని స్థితిని సూచించడానికి సాఫ్ట్‌వేర్ చిప్‌లను వండుకు తినడం వంటి ప్రయోగాలు పాఠకుడికి ఒక రకమైన వెగటును కలిగిస్తూనే వాస్తవాన్ని బోధిస్తాయి.
ఎమ్మెస్ సూర్యనారాయణ కథల్లో భాషా శైలి కవిత్వానికి దగ్గరగా ఉండి, పదునైన పదబంధాలతో సాగుతుంది. "చీము వెన్నెల," "మాయాయుద్ధం," "ఉల్లి వజ్రం," "కళ్లల్లో ఎడార్లు" వంటి ప్రయోగాలు ఆయన శైలికి ప్రాణం పోస్తాయి. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం పోసి మాట్లాడించడం ద్వారా (Personification) కథలోని గాఢతను పెంచుతారు. సంభాషణల్లో వ్యంగ్యం, పరుషమైన నిజాలు మెండుగా ఉంటాయి. అయితే కొన్నిచోట్ల ఉపన్యాస ధోరణి కనిపిస్తుందని, సామాన్య పాఠకుడికి ఆయన ప్రయోగాత్మక శిల్పం కొంత గందరగోళం కలిగించవచ్చని విమర్శకులు అభిప్రాయపడినా, ఆయన ఎంచుకున్న వస్తువు, దానికి ఆయన అద్దిన గ్లోబల్ టచ్ తెలుగు కథను ఉన్నత స్థితికి తీసుకెళ్లాయి. ఎమ్మెస్ సూర్యనారాయణ కథలు కేవలం కాలక్షేప పాఠాలు కావు. అవి సామాజిక అపసవ్యతలపై విసిరిన విమర్శనాస్త్రాలు. మనిషిని యంత్రంగా మారుస్తున్న ఆధునికతను, ప్రకృతిని దోచుకుంటున్న నాగరికతను ఆయన తన డిస్టోపియన్ శైలిలో ప్రశ్నించారు. అబ్సర్డిటీని ఒక ఆయుధంగా మలచుకుని, అసహ్యం ద్వారా ఆశయాన్ని, భయం ద్వారా బాధ్యతను గుర్తుచేయడం ఆయన కథా శిల్ప రహస్యం. తెలుగు కథా చరిత్రలో ఎమ్మెస్ సూర్యనారాయణ ఒక సరికొత్త ప్రయోగశాలగా భవిష్యత్ కథకులకు మార్గదర్శిగా నిలుస్తారు.

​- డాక్టర్ సుంకర గోపాలయ్య
94926 38547

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti