Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Edition గుంటూరు - విజయవాడతో కలిపి అమరావతి మెగా సిటీ

Print Edition గుంటూరు - విజయవాడతో కలిపి అమరావతి మెగా సిటీ

  • కృష్ణానదిపై వంతెనల కోసం అధ్యయన కమిటీ

  • సిఆర్‌డిఎ అథారిటీలో నిర్ణయం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గుంటూరు, విజయవాడతో కలిపి అమరావతి మెగా సిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ మేరకు సిఆర్‌డిఏ అథారిటీ ప్రాథమిక ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీనిలో భాగంగానే అమరావతి విజయవాడను కలిపేందుకు వీలుగా కృష్ణానదిపై మరిన్ని వంతెనలు నిర్మించేందుకు అవసరమైన నివేదిక తయారు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన సిఆర్‌డిఏ అథారిటీ 64వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అథారిటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించారు.

అమరావతి విజయవాడ మధ్య ఎన్ని వంతెలను నిర్మించాలనే అంశాన్ని వీలైనంత త్వరగా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అమరావతిలో రోప్ వే ప్రాజెక్టు పిపిపి పద్ధతిలో చేపట్టేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. విజయవాడలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, దుర్గా టెంపులు, పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్, అక్కడి నుండి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేలా రోప్‌వే నిర్మించనున్నట్లు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు , రైల్వే లైన్ వేయడానికి మోడతక గ్రామంలో 2, 340 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైతులు తీర్మానం ఇచ్చారని, దీనికి ఆమోదించామని తెలిపారు.

అక్కడ భూములను పూలింగు పద్ధతిలో ఇచ్చేందుకు సిద్ధపడ్డారని వివరించారు. పల్నాడులో రాజధాని పరిధిలోకి వచ్చే ప్రాంతంలో 244.39 ఎకరాలు ఎండోమెంట్స్ కు చెందిన ఈనామ్‌ భూములు ఉన్నాయని, వాటిని ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని ఇవ్వాలంటే 122 కోట్లు కట్టాల్సి ఉందని, దీనికి ఆమోదించామని వివరించారు. 2014-19లో హ్యాపీ నెస్ట్ స్టార్ట్ చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. రైతులకు వార్షిక కౌలు రూ.300 కోట్లు అవుతోందని, దీనిని గత నెలలో చెల్లించిన నేపథ్యంలో తీసుకున్న రుణానికి ర్యాటిఫికేషన్ చేసినట్లు పేర్కొన్నారు.

రాజధానిలో నెట్ వర్క్‌ పెంచేందుకు 20 ప్రాంతాల్లో 5జి టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు. క్వాంటం వ్యాలీకి రెండు టవర్లను 18 అంతస్తులతో నిర్మిస్తున్నామని, దీనికి అవసరమైన రూ.1205 కోట్లను ఎల్‌అండ్‌టికి ఇచ్చేందుకు అథారిటీ ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో మన సంప్రదాయాలు కనిపించేలా ఉండేందుకు అవసరమైన పరిశీలనకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పారు. అమరావతి ఐ టెండర్ పిలిచేందుకు అధారిటీ అనుమతిచ్చిందని, సీడ్ యాక్సిస్ రోడ్డు దాదాపు అయిపోయిందని చెప్పారు.

వర్షాలు రాకుండా ఉంటే 13 వ తారీఖున సిఎం విజిట్ చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ టవర్లు సిద్ధమయ్యాయని, వాటిని అదే రోజు ముఖ్యమంత్రి సాధారణ పరిపాలనశాఖకు అప్పగిస్తారని అన్నారు. టోటల్ క్యాపిటల్ సీటి 217 కిలో మీటర్లుకు 4 ఎస్ టీ పీలు వస్తాయని, మెగా సిటి అయితే కోటి జనాభా టార్గెట్‌ పెట్టుకున్నామని తెలిపారు. దీనికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు కేంద్రీయ విద్యాలయం భూ కేటాయింపులకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ స్టాంపుడ్యూటీ ఫీజును మినహాయించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti