మంత్రి అనగాని సత్య ప్రసాద్
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : గ్రామాల్లో నెలకొన్న భూవివాదాల్లో సమస్యలు లేకుండా చూస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, పుల్లడిగుంట, ఏటుకూరు గ్రామాల్లో మంగళవారం 812 కుటుంబాలకు శాశ్వత పట్టాల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. వట్టిచెరుకూరులో జరిగిన 'మీ భూమి - మీ హక్కు' ద్వారా 41.46 ఎకరాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆయన తెలిపారు. 22 - ఎ భూ సమస్యలకు పరిష్కార ధ్రువపత్రాలను అందజేశారు. 22-ఎ సమస్య వల్ల దశాబ్దాలుగా రికార్డుల తారుమారు, రీసర్వే సమగ్రంగా జరగకపోవడం వంటి సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు.
పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్రను ముద్రించి రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నామన్నారు. ఎవరైనా భూములను అమ్ముకోదలిచిన, లేదా అభివృద్ధి పరచుకోదలిచినా ఎనిమిది శాతం ఛార్జ్ చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. వీలునామా లేకుండా జరిగే ఇన్హెరిటెన్స్ కేసుల్లో స్టాంప్ డ్యూటీని కూటమి ప్రభుత్వం చాలా వరకు తగ్గించిందన్నారు. రూ.పది లక్షల వరకు ఉన్న ఆస్తులకు కేవలం వంద రూపాయలతో, పది లక్షల రూపాయలు ఉండే ఆస్తులకు వెయ్యి రూపాయలు నిర్ణయించిందన్నారు. ప్రత్తిపాడు లో రూ.వందకోట్ల నిధులతో ఆయుర్వేద హాస్పిటల్‌కి అనుమతి వచ్చిందని, త్వరలోనే ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బి.రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

