డిజిపి హరీష్‌కుమార్ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో అత్యంత కీలకమని డిజిపి హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు.
నిరంతరం సవాళ్లతో కూడిన విధులు నిర్వర్తించే పోలీసులు ఫిట్‌నెస్, క్రీడలను తమ వృత్తి జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీస్‌శాఖ ఆధ్వర్యాన తొలిసారిగా నిర్వహిస్తోన్న ఎపి స్టేట్ పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026ను మంగళగిరిలోని ఎపిఎస్‌పి 6వ బెటాలియన్ మైదానంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. శాంతి కపోతాలు, బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న 16 టీమ్‌ల నుంచి డిజిపి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం, క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిని తట్టుకోవడం, బృందంగా పనిచేయడం పోలీసు విధుల్లో భాగమని అన్నారు. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే శారీరక, మానసిక సామర్థ్యాన్ని క్రీడలు పెంపొందిస్తాయని తెలిపారు. గెలుపును వినయంగా స్వీకరించి..
ఓటమిని పట్టుదలకు పునాదిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పోలీసు క్రీడాకారులు సాధించే విజయాలు పోలీసు బలగాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. తొలి రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా సమ్మేళనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీసు స్పోర్ట్స్ వింగ్, నిర్వాహక బృందాలను డిజిపి అభినందించారు. పోటీలకు అవసరమైన వేదికలు, సౌకర్యాలు కల్పించిన రెండు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మీట్ ఫిట్‌నెస్, ప్రతిభ, క్రమశిక్షణ, సమిష్టితత్వం, క్రీడాస్ఫూర్తికి వేదికగా నిలిచి భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన క్రీడా సమ్మేళనాలకు బలమైన పునాది వేయాలని ఆకాంక్షించారు. ఈ పోటీలు నాలుగో తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డిజిపి (శాంతిభద్రతలు) ఎన్ మధుసూదన్‌రెడ్డి, ఐజిపి ఆకే రవికృష్ణ (ఈగల్ చీఫ్), బి రాజకుమారి (వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్), సిహెచ్ శ్రీకాంత్ (టెక్నికల్ సర్వీసెస్, ఆపరేషన్స్), కెవి మోహన్‌రావు (స్పోర్ట్స్, వెల్ఫేర్), డిఐజిలు అన్బురాజన్, (స్పోర్ట్స్, వెల్ఫేర్), ఆర్ఎన్ అమ్మిరెడ్డి (అడ్మిన్), గుంటూరు ఎస్‌పి వకుల్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు.

