Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionకచ్చితమైన ఓటర్ల జాబితా తయారీకి పార్టీల సహకారం అవసరం

Print Editionకచ్చితమైన ఓటర్ల జాబితా తయారీకి పార్టీల సహకారం అవసరం

  • అఖిలపక్ష సమావేశంలో సిఇఒ వివేక్ యాదవ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూటికి నూరు శాతం కచ్చితమైన, పారదర్శకమైన, సమగ్ర ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీలు, పౌర సంస్థలు, ప్రజలు చురుగ్గా భాగస్వాములు కావాలని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఫొటో ఓటరు జాబితాలను ఈ నెల 31న విడుదల చేసిన నేపథ్యంలో, ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్ర సచివాలయంలో టిడిపి, వైసిపి, సిపిఎం, సిపిఐ, బిజెపి, జనసేన, కాంగ్రెస్‌ ఇతర వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటరు జాబితాల సాఫ్ట్ కాపీలను అందజేశారు. అంతకుముందు వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా 2026 జులై 1ను అర్హత తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,72,02,684గా ఉందని, ఇందులో పురుషులు 1,82,69,019, మహిళలు 1,89,30,929, థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 2,736 మంది ఉన్నారని వెల్లడించారు. మరణాలు, శాశ్వత నివాస మార్పు, బహుళ నమోదులు, ఆచూకీ లభించకపోవడం తదితర కారణాలతో 44,89,512 మంది ఓటర్లు తమ నమోదిత చిరునామాల్లో గుర్తించనట్లు వివరించారు. గణన ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా హేతుబద్ధీకరణ చేపట్టడంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,397 నుంచి 50,330కు పెరిగిందని తెలిపారు. తగిన విచారణ లేకుండా ఏ ఓటరినీ జాబితా నుంచి తొలగించబోమని స్పష్టం చేసిన ఆయన, 2002 ప్రత్యేక సవరణ వివరాలతో సరిపోలని ప్రతి నమోదుపై సంబంధిత ఓటరుకు నోటీసు జారీ చేసి విచారణ అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముసాయిదా జాబితాలో పేరు లేని, 2026 జులై ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి పౌరుడు క్లెయిమ్స్ గడువులోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలు ఇఆర్‌ఒ, ఇఇఆర్‌ఒ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, వివరాల కోసం 1950 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు జయరామ్‌, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్సీ పి అశోక్‌ బాబు, వైసిపి నుంచి మాజీ మంత్రి పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం, బిజెపి నుంచి అంకా దినకర్‌ ఇతర పార్టీల నాయకులు, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్యూమరేషన్‌ ఫారాలు రాజకీయ పార్టీలకు ఇవ్వండి : సిపిఎం

తొలగించిన ఓటర్లు 44,89,512 మందికి సంబంధించిన ఎన్యూమరేషన్‌ ఫారాలను బూత్‌లవారీ రాజకీయ పార్టీలకు హార్డ్‌ కాపీలను అందజేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు కోరారు. మ్యాపింగ్‌ చేయకుండా, ఓటర్ల ఆధారాలు సేకరిస్తున్న ఓట్ల సంఖ్య, వాటి వివరాలను అందజేయాలన్నారు. ఒకే కుటుంబానికి చెంది, వేర్వేరు బూత్‌లలో ఓటు హక్కు కలిగి ఉన్నవారిని ఒకే పోలింగ్‌ బూత్‌ పరిధిలోకి తేవాలని సూచించారు. బిఎల్‌ఒలకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నందున వారికి ఇతర పనులు కేటాయించకుండా ఈ పనులే అప్పగించాలని కోరారు. ​


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti