పట్టణంలో 144 సెక్షన్
ప్రజాశక్తి - పలాస : కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, వైసిపి నాయకులు సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మంగళవారం విచారించారు.
కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో అంపోలు జైలు నుంచి పోలీస్ బందోబస్తుతో ఉదయం 11 గంటల సమయంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. 144 సెక్షన్ విధించడంతో వైసిపి నాయకులను పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టడి చేశారు. అప్పలరాజు న్యాయవాది బి.బాలకృష్ణ, భార్య శ్రీదేవిని మాత్రమే అనుమతించారు. కాశీబుగ్గ, టెక్కలి డిఎస్‌పిలు టి.భవాని, లక్ష్మణరావు ఆధ్వర్యంలో సోంపేట సిఐ మంగరాజు విచారణ చేపట్టారు. 11.30 గంటలకు విచారణ ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం పలాస సామాజిక ఆస్పత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి మాధురి ఎదుట ఆయనను హాజరు పరిచారు. అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించారు.

