పామాయిల్, జామాయిల్ తోటల్లో మకాం
ప్రజాశక్తి - జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
దట్టమైన అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లో తిరుగుతూ అటవీ అధికారులకు సవాలు విసురుతోంది. సోమవారం రాత్రి మైసన్నగూడెం పరిసర ప్రాంతాల్లోని పామాయిల్, కోకో తోటల్లో మకాం వేసిన పులి రాత్రి సమయంలో రూట్ మార్చి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ గుండా గంగన్నగూడెం, దాట్లవారిగూడెం, సిర్రివారిగూడెం మీదుగా దర్భగూడెం బీట్‌లోకి ప్రవేశించింది. అక్కడే పామాయిల్, జామాయిల్ తోటల్లో మకాం వేసినట్లు ట్రాకర్ ద్వారా గుర్తించారు. ఆరుగురు ప్రత్యేక షూటర్లతో ఐదు బృందాలు రంగంలోకి దిగినా పెద్దపులిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. జనావాసాల్లో తిరుగుతున్న పెద్దపులి నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఏలూరు జిల్లా డిఎఫ్ఒ సందీప్ రెడ్డి, రాజమండ్రి డిఎఫ్ఒ త్రిమూర్తులురెడ్డితోపాటు సిసిఎఫ్ టి.జ్యోతి ఆధ్వర్యంలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

