Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionనాన్ ఆక్వా జోన్‌కూ విద్యుత్ రాయితీ

Print Editionనాన్ ఆక్వా జోన్‌కూ విద్యుత్ రాయితీ

  • ఈ నెల నుంచి అమలు

  • సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నాన్ ఆక్వా జోన్‌లో ఉన్న ఆక్వా రైతులకూ రాయితీపై విద్యుత్ సదుపాయాన్ని ఈ నెల నుంచే అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఆక్వా జోన్ పరిధిలో ఇస్తున్నట్లే నాన్ ఆక్వా జోన్‌లో ఉన్న రైతులకూ యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జల వనరులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రాష్ట్రంలోని ప్రతి రైతు వద్దకు వెళ్లాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ఈ నెల నుంచి దీనిని అమలు చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నిర్ణయంతో 12,500 మంది ఆక్వా రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంపై ఈ నెల 7వ తేదీ నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అక్టోబరు మాసం వరకూ లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అనుసరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేకించి పిఎండిఎస్‌ విధానంలో సాగు చేసేందుకు ఉన్న అవకాశాలను రైతులకు వివరించేలా రైతుల వద్దకు వెళ్లాలని నిర్దేశించారు. ఎల్‌నినో లాంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్పష్టమైన విధానాన్ని రైతులకు అందించాలన్నారు. రైతు యాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వేగంగా అందించాలని స్పష్టం చేశారు. వర్షపాతం తగ్గి, సాగు విస్తీర్ణం పెరుగుతోందని, క్షేత్రస్థాయిలో వస్తున్న ఈ మార్పులకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. ఎల్‌నినో ఎఫెక్ట్ మిటిగేషన్ యాక్షన్ ప్లాన్ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పశువుల దాణా విషయంలోనూ విబి గ్రామ్‌ జిను అనుసంధానించాలన్నారు.

పొగాకు రైతును ఆదుకునేందుకు రూ.94 కోట్లు

ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు ధర ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. వెంటనే ఇది అమల్లోకి రావాలని దిశానిర్దేశం చేశారు. 94 మిలియన్ కేజీల ఆఫ్ స్టైల్ పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీని ద్వారా 44 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, రైతులు సహా ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసి సమీక్షించాలని సూచించారు. అలాగే ఎఫ్‌సివి పొగాకు కొనుగోళ్లు ప్రస్తుతం 48.27 మిలియన్ కేజీల కొనుగోళ్లు జరిగాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేలా బ్యారెల్‌కు రూ.50 వేల రుణం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సిఎం ఆదేశించారు. ఆక్వా సంక్షోభాన్ని నివారించేలా రొయ్య మేత ధరల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ఫిష్ మీల్ ఎగుమతులను 50 శాతానికి తగ్గించేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకూ రొయ్యమేత ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై వేగంగా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇక నుంచి ప్రతి మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై, ఎల్‌నినో ప్రభావం నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఈ సమీక్షకు మంత్రి కె అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, జల వనరులు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti