Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionప్రయివేటు అంతరిక్ష సంస్థలకు రాయితీల వర్షం

Print Editionప్రయివేటు అంతరిక్ష సంస్థలకు రాయితీల వర్షం

  • ఇస్రోను నిర్వీర్యం చేసేలా కేంద్రం నిర్ణయం

ప్రజాశక్తి- సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి జిల్లా) : అంతరిక్ష రంగాన మువ్వన్నెల పతాకను రెపరెపలాడించిన ప్రభుత్వ రంగంలోని అంతరిక్ష‍ పరిశోధన సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పదేపదే వినాశకర చర్యలను కొనసాగిస్తోంది.

విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (విఎస్‌ఎస్‌సి) - తిరువనంతపురం, సతీష్‌ దావన్‌ అంతరిక్ష‍ కేంద్రం (ఎస్‌డిఎస్‌సి-ఎస్‌హెచ్‌ఎఆర్‌) - శ్రీహరికోట, యుఆర్‌ రావు ఉపగ్రహ కేంద్రం (యుఆర్‌ఎస్‌సి) - బెంగళూరు, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ - హైదరాబాద్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) వంటి ప్రభుత్వం రంగంలోని పరిశోధన సంస్థలు అంతరిక్ష‍ రంగాన చారిత్రాత్మక విజయాలు సాధించాయి. మోడీ సర్కార్‌ ఇది గిట్టడం లేదు. నింగి నేల సర్వం ప్రయివేటు కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెట్టడమే తమ ధ్యేయమున్నట్టుగా ప్రభుత్వ రంగాలను కుంగదీస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అంతరిక్ష‍ రంగంలోకి ఇప్పటికే చొరబడుతున్న ప్రయివేటు సంస్థలకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రపంచ స్థాయిలో పోటీతత్వం పెంచడం, దేశీయ వాణిజ్య ప్రయోగాలకు ఊతమిచ్చే సాకులు చెబుతూ అంతరిక్ష‍ రంగంలోకి ప్రైవేట్, ప్రభుత్వేతర సంస్థలకు ఎర్రతివాచి పరుస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతి కేంద్రం కొత్త ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది.

రాయితీల వర్షం..

  • ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలకు ప్రయోగ సేవలు, ఇస్రో మౌలిక సదుపాయాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఉపగ్రహ సమాచార వినియోగంపై 30 శాతం నుంచి వంద శాతం వరకు సబ్సిడీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

  • రూ.800 కోట్ల వ్యయంతో ఐదేళ్లపాటు ప్రత్యేక ప్రయోగ సేవల ధరల మద్దతు పథకాన్ని అమలు చేయనుంది.

  • తొలి విభాగంలో ఇస్రో, అంతరిక్ష శాఖకు చెందిన ప్రయోగ సదుపాయాల వినియోగానికి గరిష్టంగా 50 శాతం వరకు సబ్సిడీ ప్రకటించింది.

  • రెండో విభాగంలో భారతీయ చిన్న ప్రయోగ వాహనాల ద్వారా 500 కిలోగ్రాముల వరకు ఉపగ్రహాలు, పేలోడ్లను ప్రయోగించేవారికి ఒప్పంద వ్యయంలో 30 శాతం లేదా కిలోగ్రాముకు గరిష్ఠంగా మూడు వేల అమెరికా డాలర్లు, ఏది తక్కువైతే అది సబ్సిడీగా చెల్లించేందుకు సిద్ధమైంది.

  • భారత భూభాగం నుంచి భారతీయ ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ప్రయోగాలకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతి కేంద్రం అధ్యక్షులు పవన్ గోయెంకా ప్రకటించారు. స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్ ద్వారా చేపట్టే ప్రయోగాలు ఈ పథకానికి అర్హమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

  • మూడో విభాగంలో 120 కిలోగ్రాముల వరకు పేలోడ్లను మోసే ప్రత్యేక ప్రయోగాలకు కిలోగ్రాముకు గరిష్టంగా 13 వేల అమెరికా డాలర్ల పరిమితిలో వంద శాతం ప్రభుత్వ నిధులు అందిచనున్నారు. ఈ సదుపాయం నాలుగు ప్రయోగాల వరకూ కల్పించనున్నారు.

  • నాలుగో విభాగంలో ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహనం, భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగ వాహనం, భారీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ద్వారా వంద కిలో గ్రాముల వరకు ఉపగ్రహాల ప్రయోగాలకు ఒప్పంద వ్యయంలో 30 శాతం లేదా కిలోగ్రాముకు మూడు వేల అమెరికా డాలర్ల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు.

  • మరో ప్రత్యేక పథకం కింద ఇస్రో, అంతరిక్ష శాఖ, భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతి కేంద్రానికి చెందిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక నిపుణుల సేవల వినియోగానికి 50 శాతం వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇస్రో నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ రుసుముపై 30 శాతం సబ్సిడీ, భూ పరిశీలన ఉపగ్రహ సమాచార కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ, వాతావరణ సేవలు, భౌగోళిక సమాచార ఆధారిత సేవల్లో పనిచేసే భారతీయ సంస్థలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని భారత అంతరిక్ష కేంద్రం పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti