Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionరోడ్లు రక్తసిక్తం..

Print Editionరోడ్లు రక్తసిక్తం..

  • చిలకలూరిపేటలో బస్సు, ఆటో ఢీకొని ఏడుగురు దుర్మరణం

  • కళ్యాణదుర్గంలో కారుబోల్తా పడి ఇద్దరు మృతి

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ర్టంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆటోను బస్సు ఢీకొనడంతో ఏడుగురు మరణించారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అదుపుతప్పి కారు బోల్తా పడడంతో ఇద్దరు మరణించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి అమ్మాయికి ప్రకాశం జిల్లా కొండమంజులూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వారి కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు తమ బంధువులు వేలూరు నుంచి పది మంది మహిళలు, నలుగురు చిన్నపిల్లలు, ఇద్దరు పురుషులు కలిసి బుధవారం సాయంత్రం ఆటోలో బయలుదేరారు. వేడుకలు ముగిశాక రాత్రి 10.30 గంటల తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో చిలకలూరిపేట అడ్డ రోడ్డు వద్ద మలుపు తిరిగి ప్రధాన రహదారిని దాటిన అనంతరం కళామందిర్‌ సెంటర్‌ మీదుగా వేలూరుకు ఆటో రావాల్సి ఉంది. అయితే ప్రధాన రహదారిపై మలుపు తిరిగిన ఆటోను విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న వరుణ్‌ ట్రావెల్స్‌కు చెందిన ఇంటర్‌ సిటీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. బస్సు వేగానికి ఆటో ఐదు మీటర్ల వరకూ దూసుకెళ్లడంతో ఆటోలోని బొంత మరియమ్మ(45), చౌటుపల్లి సువార్తమ్మ (50), బొంత సంపూర్ణమ్మ (65), బొంత గంగమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా చౌటుపల్లి లక్ష్మమ్మ మార్గ మధ్యలోనే మృతి చెందారు. బొంత మాణిక్యమ్మ (55), బొంత బాబు (58) దంపతులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. మృతుల్లో దంపతులు మినహా మిగతా వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని చిలకలూరిపేటలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట చీరాల రహదారిపై గురువారం రాత్రి బంధువులు ఆందోళన చేపట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తామని ట్రావెల్స్‌ యాజమన్యం పేర్కొంది. అయితే ప్రభుత్వం తరపున నిర్దిష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన ఉపాధ్యాయుడు రాఘవేంద్రగుప్తా, టైక్స్‌టైల్‌ యజమాని బెలుగుప్ప నాగరాజు కలిసి మరో ఇద్దరు నరహరి, హర్షతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని కడూరు ప్రాంతానికి వెళ్లి వస్తుండగా బ్రాహ్మణపల్లి గేటు వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాఘవేంద్ర గుప్తా (48), బెలుగుప్ప నాగరాజు (50) అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన హర్ష, నరహరిని బెంగళూరుకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అందజేశారు. రాఘవేంద్ర గుప్తా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti