నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఎపి వాసులు
ప్రజాశక్తి - యంత్రాంగం : నేపాల్ వరదల్లో చిక్కుకున్న పలువురురాష్ట్ర వాసులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
వారి కోసం కుటుంబీకులు కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నారు.హైదరాబాదు నల్లగండ్లలో భార్యా పిల్లలతో ఉంటున్న కుప్పం వాసి బాలసుబ్రమణ్యం ఈ నెల 13న ఈషా కైలాస్ గ్రూప్ ద్వారా మానస సరోవర్, మౌంట్ కైలాస్ యాత్రకు వెళ్లారు. అయితే హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు బుధవారం నేపాల్లోని గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్న సమయంలో భారీ వరదలు రావడంతో బాలసుబ్రమణ్యం గల్లంతైనట్లు సమాచారం. బుధవారం నుంచి బాలసుబ్రమణ్యం ఫోన్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 28వ తేదీ రాత్రి బాలసుబ్రమణ్యం హైదరాబాదు చేరుకోవాల్సి ఉండగా 26వ తేదీ బుధవారం వరదల్లో చిక్కుకున్నారు. అయితే తన తమ్ముడు బాలసుబ్రమణ్యం ఆచూకీ కోసం సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయాన్ని సంప్రదించినట్లు కుప్పం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు.
నేపాల్‌లో చిక్కుకున్న విశాఖ జిల్లా భీమిలి వాసులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఫోన్‌లో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. వదరల్లో చిక్కుకున్నవారిలో భీమిలి జెడ్‌పిటిసి సభ్యులు వెంకటప్పడు. వెంకట నారాయణ, తాతినాయుడు సహా ఎనిమిది మంది ఉన్నారు. వీరంతా ఈ నెల 21న విశాఖ నుంచి బయలుదేరి 22న ఖాట్మాండ్‌కు చేరుకున్నారు. చైనా నుంచి వీసా జారీ ఆలస్యమవడంతో నేపాల్‌లోనే ఉండిపోయారు.
కర్నూలు జిల్లా ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, కిడ్డీస్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న భాస్కర్ శాస్త్రి ఆయన భార్య శారద, కుమారుడు రంగనాథ్ శాస్త్రి, కోడలు హన్సిక ఈనెల 18న మానస సరోవర యాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా డార్చిన్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా భారీ వరదలు రావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వారు అక్కడే చిక్కుకుపోయారు. రంగనాథ్ శాస్త్రి అస్వస్థతకు గురికావడంతో ఆయనను డార్చిన్ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు సురక్షితంగా హోటల్‌లో బస చేస్తున్నట్లు భాస్కర్ శాస్త్రి కుమార్తె స్వాతి గురువారం తెలిపారు. తమకు సరైన సహాయం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని యాత్రికులకు సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి, అక్కడి అధికారులకు విన్నవించినట్లు ఎమ్మెల్యే పార్థసారథి, ఆర్‌డిఒ అరుణాదేవి తెలిపారు.
తిరుపతికి చెందిన సిగ్నిన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నేపాల్-మానస సరోవర్ యాత్రకు 26 మంది యాత్రికులు వెళ్లారు. వీరిలో తెలంగాణకు చెందిన 12 మంది, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ప్రాంతానికి చెందిన 14 మంది ఉన్నారు. ప్రస్తుతం యాత్రికులంతా కాఠ్మాండులో సురక్షితంగా ఉన్నారని ఎంపి గురుమూర్తి తెలిపారు.

