Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionతగినంత  నీరిచ్చి కృష్ణా డెల్టా పంటలను కాపాడండి

Print Editionతగినంత నీరిచ్చి కృష్ణా డెల్టా పంటలను కాపాడండి

  • సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కృష్ణా డెల్టాకు తగినంత నీరు ఇచ్చి పంటలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.

శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎగువన పడ్డ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు నీళ్ళు చేరుకున్నందున డెల్టాలో నాట్లు వేసుకోడానికి నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక నెల ముందుగానే నీటిని విడుదల చేస్తామని, రైతులు ముందుగానే నార్లు పోసుకోవాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును ఆయన గుర్తు చేశారు. సిఎం పిలుపుతో రైతాంగం నార్లు పోయటం, దుక్కులు దున్నడం ప్రారంభించారు కొందరు రైతులు ఎద చల్లడం ద్వారా వరి వేశారని తెలిపారు.

జూలై చివర్లో ముఖ్యమంత్రి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని కృష్ణా డెల్టాలో వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రకటించారని పేర్కొన్నారు. అవసరమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా లేకుండా చేసిన ఈ ప్రకటన రైతుల్లో గందరగోళానికి దారి తీసిందని, కృష్ణా డెల్టాలోని కృష్ణాజిల్లా, బాపట్ల జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వరి తప్ప మరొక పంటకు పనికిరావని భూములున్నాయని అటువంటి ప్రాంతాల్లో రైతాంగం మరింత ఆందోళనగా ఉందని పేర్కొన్నారు. పట్టిసీమ నుండి ప్రస్తుతం రోజుకు 5, 200 క్యూసెక్కుల నీరు వస్తోందని, గోదావరిలో వరద ప్రవాహం పెరిగిన దృష్ట్యా అన్ని పంపులు పనిచేయించి ఏడువేల క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. పులిచింతలలో 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో శ్రీశైలానికి 1,36,000 క్యూసెక్కుల నీరు వస్తోందని, ఇంకా వచ్చే అవకాశం ఉన్నందున పులిచింతల నుండి రోజుకు 5,000 క్యూసెక్కులు తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాలో ఎక్కువ ప్రాంతంలో పంటలు పండించడానికి అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం పేరుతో వరి పండదని అంచనా వేసిన గుత్త వ్యాపారస్తులు బియ్యాన్ని నిల్వ చేసుకొని అధికరేట్లకు అమ్ముతున్నారని తెలిపారు. తద్వారా మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. ఆహార పంటగా వరికున్న ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వరిపంటను ఆదుకోవాలని కోరారు. గోదావరి నదిలో సరిపడా నీరు ఉందని, ధవళేశ్వరం నుండి ఏలూరు కాల్వ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టులో పెదపాడు, దెందులూరు మండలాలకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని, గతంలో 80 టిఎంసీలతోనే కృష్ణా డెల్టాలో వారబందీ పెట్టి పంటలు పండించిన అనుభవం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా చర్చించి కృష్ణా డెల్టాకు అవసరమైన నీరు ఇచ్చి పంటలు పండించేందుకు తోడ్పడాలని ప్రత్యామ్నాయ పంటలు వేయగలిగిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయించేందుకు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని సిపిఎం కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti