యుటిఎఫ్ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టెట్ పరీక్ష రాస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు పరీక్ష రోజు ఆన్ డ్యూటీ సదుపాయం కల్పించాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యుటిఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సి ఉందని యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి 22 వరకు నిర్వహించే జనరల్ టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరవుతున్నారన్నారు. టెట్ పరీక్ష రాసే ఉపాధ్యాయులకు పరీక్ష రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని గతంలోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు యుటిఎఫ్ వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్న పాఠశాలల్లో అవసరమైతే ఆ రోజు కాంపెన్సేటరీ సెలవు ప్రకటించాలని సూచించారు. ఎపిపిఎస్‌సి నిర్వహించే శాఖాపరమైన పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌ల కోసం కనీసం రెండుసార్లు ఆన్ డ్యూటీ సదుపాయం కల్పిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఒకే పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఒకేరోజు టెట్ పరీక్షకు హాజరుకావాల్సి వస్తే, ఆయా పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవు ప్రకటించేలా విద్యాశాఖ అధికారులు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

