Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionవినియోగదారుల సేవలకు ప్రాధాన్యం

Print Editionవినియోగదారుల సేవలకు ప్రాధాన్యం

  • సిపిడిసిఎల్‌ సమీక్షలో సిఎమ్‌డి పుల్లారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిసిపిడిసిఎల్‌ పరిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, వినియోగదారుల సేవలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆ సంస్థ సిఎమ్‌డి పి పుల్లారెడ్డి ఆదేశించారు.

సిపిడిసిఎల్‌పై విజయవాడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం పుల్లారెడ్డి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతి అధికారి తన పరిధిలోని పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని సూచించారు. ఇటీవల చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ కంచెలు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను వేగవంతంగా అమలు చేసి, అర్హులైన వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ లక్ష్యాలను సాధించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి సర్కిల్‌లో రెవెన్యూ వసూళ్లను మెరుగుపరచడం, విద్యుత్ నష్టాలను తగ్గించడం, పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయడం, వినియోగదారుల సేవలను మరింత సమర్థవంతంగా అందించడం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎస్ వెంకటేశ్వర్లు (ఫైనాన్స్‌), ఆవుల మురళీకృష్ణ యాదవ్ (టెక్నికల్), టివిఎస్‌ఎన్‌ మూర్తి (ప్రాజెక్ట్స్) తదితరులు పాల్గొన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti