ప్రజాశక్తి - గిద్దలూరు (ఒంగోలు): రాచర్ల ప్రాంతంలో ఇటీవల పులిని వేటాడిన కేసులో ఏడుగురు నిందితులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరు అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోస్టుమార్టం, నమూనాల సేకరణ సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టి, ఎన్‌టిసిఎ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) నిబంధనలకు అనుగుణంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. పులి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి, ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం వివిధ ప్రయోగశాలలకు నమూనాలు పంపినట్లు వివరించారు. సాంకేతికత, డాగ్ స్క్వాడ్‌తో పాటు హనుమాన్ టీమ్ సహకారంతో నిందితుల ఆచూకీ కనిపెట్టినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి వేటకు ఉపయోగించిన నాటు తుపాకీ, గొడ్డలితో పాటు ఏడు పులి గోర్లు, ఎముకలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాచర్ల మండలం జె.పి.చేరువు రెవెన్యూ పరిధిలో నాటు తుపాకీతో పులిని కాల్చి చంపినట్లు విచారణలో తేలడంతో వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మిగిలిన పులిగోర్లు ఏమయ్యాయి, అరెస్టయిన వ్యక్తులతో పాటు పులిని చంపడంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు నాషా కుమారి తెలిపారు.

