ప్రజాశక్తి-కలెక్టరేట్
గత వాగ్దానాలను విస్మరించి నిరుద్యోగులు అందరిలో నిరాశ మిగిల్చిన విధంగా 2021- 22 ఉద్యోగ వార్షిక క్యాలెండర్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఆధ్వర్యంలో ఎయు మెయిన్ గేట్ నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ,అక్కడ మానవహారం జరిపారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ నగర కార్యదర్శి యుఎస్ఎన్ రాజు, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎల్ జె నాయుడు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు సంస్థ నిర్వాహకులు ఎ చిన్నారావు , ఎం అప్పారావు , ఎం శ్రీహరి తదితరులు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కార్యదర్శి యుఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 83 వేల పోస్టులు ఖాళీగా ఉండగా 1043 పోస్టులతో క్యాలెండర్ విడుదల చేశారని,అయితే అందులో ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు, పోలీసు ఉద్యోగాల గురించి ప్రస్తావన లేదన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన మేరకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గ్రూపు-1 గ్రూపు-2 ఉద్యోగాలు 1,000 పోస్టుల భర్తీ చేయాలన్నారు. డిఎస్సీని జాబ్ క్యాలెండర్ లో చేర్చి ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 6,500 పోస్టులు భర్తీ చేయాలన్నారు. లైబ్రరీలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు 5 వేలు ఉండగా 1,238 మాత్రమే జాబ్ చార్ట్ లో ప్రకటించడం సరికాదన్నారు.ఉద్యోగాల వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి అశోక్,కె సత్యం, జి ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

