Dailyhunt
పుతిన్‌ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుంది : రష్యన్‌ కమ్యూనిస్టుల ప్రతిన

పుతిన్‌ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుంది : రష్యన్‌ కమ్యూనిస్టుల ప్రతిన

  • పార్టీ కార్యాలయాలపై పోలీసుల దాడులకు ఖండన

మాస్కో : ప్రభుత్వ అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందని రష్యన్‌ కమ్యూనిస్టులు స్పష్టం చేశారు.

మాస్కోలోని తమ పార్టీ కార్యాలయాలపై అధికారులు దాడులు చేయడం, పెద్దసంఖ్యలో కార్యకర్తలను కూడా నిర్బంధించిన నేపథ్యంలో వారీ ప్రకటన చేశారు. శనివారం నాటి ఆపరేషన్‌లో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు పాక్షికంగా ఆక్రమించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బ్యాలెట్‌ రిగ్గింగ్‌ జరిగిందని కమ్యూనిస్టులు ఆరోపించడంతో పోలీసులు దాడులు ఆరంభించారు. 'ఎమర్జన్సీ ద్వారాలు, కిటికీలు ఇలా అన్ని వైపుల నుండి వారు మమ్మల్ని చుట్టుముట్టారు, ఇది ఇంకా కొనసాగుతోందని' పార్టీ నాయకులు పేర్కొన్నారు. రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ శనివారం నిరసన జరిపిన వారి కోసం అధికారులు గాలిస్తున్నారని తెలిపారు. 'చాలా రోజుల నుండి వారు నా కోసం చూస్తున్నారు. ఏళ్ళ తరబడి నేను నివసించిన ప్రాంతాల్లో వారు గాలిస్తున్నారు. నన్ను నిర్బంధించాలన్నది వారి ఆలోచన' అని పావెల్‌ ఇవనొవ్‌ తెలిపారు. గత వారం జరిగిన ఎన్నికల ఫలితాన్ని ఆమోదించేందుకు రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ (సిపిఆర్‌ఎఫ్‌) నిరాకరిస్తోంది. ఇతర ప్రాంతాల కన్నా మాస్కోలో ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. ఎలక్ట్రానిక్‌ ఓట్లు లెక్కించిన తర్వాత నాటకీయ రీతిలో తుది జాబితా మారిపోయింది. పుతిన్‌ పార్టీ యునైటెడ్‌ రష్యాకి అనుకూలంగా చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని విమర్శిస్తూ కమ్యూనిస్టులు నిరసనలకు పిలుపిచ్చారు. ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో పార్టీ నాయకులు మాట్లాడేది వినబడకుండా వుండేందుకు గానూ అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా మాస్కోలోని పుష్కిన్‌ స్క్వేర్‌ వద్దదకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ర్యాలీకి మద్దతు తెలిపారు. అవినీతి ఆరోపణలు, లోపభూయిష్టమైన ఎన్నికల క్రమం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను సిపిఆర్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి గెన్నదీ జుగనొవ్‌ తీవ్రంగా విమర్శించారు. పార్టీ వెబ్‌సైన్‌ను బ్లాక్‌ చేస్తామన్న బెదిరింపులను ఖండించారు. అసమ్మతి గొంతు నొక్కాలని చూస్తున్నారంటూ పుతిన్‌ను విమర్శించారు. తిరిగి ఎన్నికలు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti