మొగల్తూరు : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఇంకా బాగా జరగాలని, అందుకోసం సలహాలు, సూచనలు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... సంక్షేమం పేదవాడిని నిలబెట్టాలని, తాత్కాలిక ఉపశమనం ఉండాలని అన్నారు. ఆడ బిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా.. ఉచిత బస్సులు తెచ్చామన్నారు. దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ఇస్తున్నామన్నారు. పేదల సేవ కోసమే మొగల్తూరు వచ్చానన్నారు. సిఎం స్థాయిలో అనేక మార్పులు చేశానన్నారు. 'ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను` అని అన్నారు. అనేక సంస్కరణలకు నాంది పలికామని చెప్పారు. ప్రజా చైతన్య కార్యక్రమాలు తెచ్చామన్నారు. ఎన్నికల్లో మీరిచ్చిన తీర్పును ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. వైసిపి హయాంలో రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగిందని తెలిపారు. కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నామన్నారు. 45 సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు టిడిపినే అంటిపెట్టుకుని ఉన్నాయన్నారు. ఆర్టీసీలో మహిళా కండక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. త్వరలో మహిళా డ్రైవర్ల వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. వడ్డెర సమాజిక వర్గానికి మైనింగ్ లీజులు పెట్టామన్నారు. గౌడ్ కులానికి మద్యం షాపులు కేటాయిస్తున్నామన్నారు. డీఎస్సీపై వైసిపి 350 కేసులు వేసిందన్నారు. వైసిపి చేస్తోన్న ప్రచారాన్ని డీఎస్సీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు పెంచామన్నారు. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉంటుంది అని చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, తదితరులు పాల్గొన్నారు.

