Wednesday, 16 Oct, 1.35 am ప్రజాశక్తి

తాజావార్తలు
రాష్ట్రంలో నేర విచారణ వ్యవస్థ దుర్వినియోగం

* మానవ హక్కుల పరిరక్షణకు జోక్యం చేసుకోండి
* ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌కు టిడిపి బృందం ఫిర్యాదు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:
రాష్ట్రంలో నేర విచారణ వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్‌ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తుకు టిడిపి బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో టిడిపి కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను అందజేసింది. టిడిపి నేతలను, కార్యకర్తలను, టిడిపికి ఓటు వేసిన ప్రజలను వేధింపులకు గురి చేస్తూ, కనీస మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారని, దీనిపై ఎన్‌హెచ్‌ఆర్సీ జోక్యం చేసుకోవాలని కోరింది. గత ఎన్నికల్లో అధికార పక్షాన్ని అసెంబ్లీ, లోక్‌సభల్లో అత్యధిక స్థానాల్లో ప్రజలు గెలిపించారని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలను, కార్యకర్తలను, ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంది. తమ సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సోషల్‌ మీడియా ప్రతినిధులతో రాజకీయ ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆరోపించింది. క్రిమినల్‌ కేసులతో వేధించడంతోనే మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబంపై 19 కేసులు నమోదు చేశారని బృందం వివరించింది. వైసిపి కార్యకర్తల సూచన మేరకు పోలీసులు పని చేస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, మానవ, ప్రాథమిక హక్కులను కాపాడేం దుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై ఎన్‌ హెచ్‌ఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ దత్తు సానుకూలంగా స్పందిస్తూ... ఆత్మకూరు సహా రాష్ట్రంలో టిడిపి శ్రేణులుపై జరుగుతున్న దాడులపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని తెలిపారు. మానవ హక్కుల కమిషన్‌ జోక్యంతో రాష్ట్రంలో వైసిపి దాడులు, అధికార దుర్వినియోగా నికి అడ్డుకట్ట పడుతుందని టిడిపి నేతలు అన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top