ప్రజాశక్తి-పొదిలి : వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నెల 26న నిర్వహిస్తున్న రైతుల పెరేడ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సిపిఎం రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య తెలిపారు. స్థానిక కార్యాలయంలో సిపిఎం పశ్చిమ ప్రకాశం కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రమేష్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ కొందరు బడా పెట్టుబడీదారుల కోసం మోడీ ప్రభుత్వం వ్యవసాయ నల్లచట్టాలను తెచ్చిందన్నారు. రైతులను బానిసలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం మద్దతు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. సంక్షోభంలోనున్న రైతులకు సబ్సీడీలు ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీల వంటి కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పగిస్తుందన్నారు.

