Wednesday, 28 Mar, 10.29 am ప్రజాశక్తి

తాజా వార్తలు
రేబాల రమణీయం

కీచకుడు పట్టపగలు బహిరంగంగా మహాసాధ్వి ద్రౌపదిపై అత్యాచారానికి పూనుకుంటాడు. ఆ వేధింపులకు, దుశ్చర్యలకు తాళలేక సరాసరి విరాట్‌ మహారాజు కొలువుకు వచ్చి ధర్మాగ్రహంతో ప్రశ్నిస్తుంది. కళ్ళ ముందు ఇంత దుర్మార్గం జరుగుతున్న అడ్డుకోలేని మీ రాజ్యాంగ సూత్రాలెందుకు? రాజులు, సామంతులు, మంత్రులు, ఋషులు అనే పదవులెందుకు? అలంకారాలెందుకు? అని ఊగిపోతూ ఆక్రోశిస్తుంది.
అజ్ఞాతవాసిగా ఉన్న 'ధర్మరాజు' పరిస్థితిని చక్క బరిచేందుకు 'రాజసభలందు తడవగ నిల్వనగునే? కులాంగనకు నిన్నులోలె! నాట్యమ్ము సూపు పొలుపునం బలుపోకల పోవనేల? ఆలసింపుక పొమ్ము మర్యాదకాదు!' అని నర్మగర్భంగా ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రాజసభల్లో పాల్గొనేవారు నాట్యాన్ని ప్రదర్శించే నర్తకీమణులు తప్ప 'మర్యాద'గల స్త్రీలు కాదనే విషయం అర్థమవుతుంది.
20వ శతాబ్దం ప్రథమార్ధం వరకు మన తెలుగునాట ఇదే పరిస్థితి నాట్యం, అభినయం ప్రదర్శించే నటీమణులంటే చాలా చిన్నచూపు చులకన భావం. స్త్రీ నాట్యం కేవలం దేవదాసి, కళావంతుల వంటి వారికే పరిమితం చేశారు. ఇలాంటి స్థితిలో స్త్రీ పాత్రలన్నీ పురుషులే ధరించడం మనకు ఆనవాయితీగా వచ్చింది. ఈ అసమంజస ఆచారాన్ని బద్ధలు కొట్టిన మహానటుడు బళ్ళారి రాఘవ. విద్యావంతులైన మధ్యతరగతి గృహిణులను సైతం ప్రోత్సహించి, వేదికపై కాలూని వారి నటనా తృష్ణను తీర్చుకొనడమేగాక, ప్రేక్షకులకు వారి అభినయ మాధుర్య విందును అందించినవాడు రాఘవ. అది వేరే విషయం.
కాగా తెలుగు రంగస్థలంపై స్త్రీ పాత్రలు పురుషులే ధరించి, యావదాంధ్రదేశాన్ని మెప్పించిన వారు ముగ్గురే ముగ్గురు. 1. పద్మశ్రీ స్థానం నర్సింహారావు, 2. రేబాల రమణ. 3. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి. వీరే నటీమణ నటత్రయం. ఇందులో ద్వితీయుడైన రేబాల రమణపై 'రమణీయం' అనే గ్రంథం ఇటీవల ఆవిష్కృతమైంది. 1939-96 మధ్యకాలం జీవించిన రమణ కళాత్మక జీవిత సంగ్రహం ఈ గ్రంథం.
'కళలు దైవ స్వరూపాలు కళాకారులు కారణజన్ములు' అని విశ్వసించిన రమణ తదనుగుణంగానే జీవనయానాన్ని క్రమశిక్షణతో సాగించారు. లేకుంటే మరెంతమందో ఏకలవ్య శిష్యులకు గురువై ఉండేవాడు. (ఇప్పటికీ చాలా మంది ఉన్నారు) 'నటనే నా జీవితం. నాటకరంగమే నా ప్రపంచం. రంగస్థలమే నా కుటుంబం. కళ కోసమే జీవిస్తాను. కళ కోసమే తపిస్తాను. కళ కోసమే మరణిస్తాను' అని బహిరంగంగా చాటుకున్న రమణ కళా జీవితం నిబద్ధతతో, నిమగతతో మిళితమైందన్న సత్యాన్ని కాదనలేం. రమణ అభినయ కౌశలానికి ఆయన నిండైన రూపం ప్రత్యేక ఆకర్షణ.
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నారదుడు వంటి పురాణ పురుషుల పాత్రలను ఎంత ధీటుగా ప్రదర్శించేవాడో - అంతే ధీటుగా సత్యభామ, చింతామణి, చంద్రమతి, సంగు, లచ్చి (బాలనాగమ్మ), నాయకురాలు నాగమ్మ (పల్నాటి యుద్ధం), తార, సక్కుబాయి వంటి పాత్రలను రసరమ్యంగా పోషించేవాడు.
రూపానికే కాక ప్రదర్శనా సామర్థ్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన దశ అది. పద్యం చదివేటపుడు రాగలాపనేకాక, భావమెరిగి పదవిరుపులతో మెరుపులను సృష్టించి ఆకట్టుకునే చతురత కొందరికే సాధ్యం. దానికి అభినయ సోయగాలు దట్టించితే ప్రేక్షకుల కనువిందుకు కొదవేముంటుంది? నాటక ప్రదర్శనానంతరం లేదా ఎక్కడ నాటకముంటే అక్కడికి వ్యయప్రయాసల కోర్చి, జనసందోహం చేరుకోవడం ఈ రమణీయ మెరుపుల కోసమే అంటే అతిశయోక్తి కాదు.
అన్నింటికంటే ముఖ్య విషయం రేబాల కుటుంబ జీవితం ఆదర్శవంతమైనది. రమణ శ్రీమతి శ్రీలక్ష్మి భర్తతో పాటు పౌరాణిక నాటకాలు నటిస్తూనే ప్రజా నాట్యమండలి నెల్లూరు జిల్లా బాధ్యులుగా పనిచేశారు. సప్ధర్‌ హష్మీ మరణానంతరం ఢిల్లీ వీధుల్లో ప్రదర్శించిన తెలుగు వీధినాటిక బృందాల్లో ప్రజానాట్యమండలి పూర్వ కార్యదర్శి దేవితో పాటు ఆమె ఒకరు. ఆమెకు ఆ విధమైన విశాలమైన ప్రోత్సాహం ఇచ్చినవారు రమణ. రమణ కుమార్తెలు దివిజ, లలిత విద్యావంతులయ్యారు. అలాగే కళారంగాన్ని అట్టిపెట్టుకునే ఉన్నారు. అలా కొనసాగడం తమ తండ్రి ప్రభావమే అని వారు వినమ్రతగా చెప్తారు.
పద్యం తెలుగు వారి హృద్యం. 'తెలుగు పద్యనాటకం 20వ శతాబ్దంలో పరిపూర్ణ వికాసం పొందింది. ఆధునికతను గణనీయ స్థాయిలో సంతరించుకుందని డాక్టర్‌ సినారె పేర్కొన్నది ఇలాంటి మహానటుల ప్రజ్ఞ వల్లనే. పాత్రోచిత భావార్థం, ఉచ్ఛారణ, మధురమైన రాగాలాపాన త్రివేణి సంగమంలా కలగలసి తమ సృజనశీల అభినయ కౌశలానికి క్షణక్షణం పదును పెడుతుంది. ప్రేక్షకుల్ని రాగరంజిత భరితుల్ని, రసప్లావితుల్ని చేయడమే కాదు; పండిత పౌరాణిక విజ్ఞానాన్ని పామరులకు సైతం వంట పట్టిస్తుంది. వంటపట్టిన ధర్మమే సమాజగమన కరదీపిక అవుతుంది. ఈ సూక్ష్మం రమణకు అవగతమైనట్టు పలువురు తెలిపిన అభిప్రాయాల వల్ల తేటతెల్లమవుతుంది. మంచి నటులకు ఇది పాఠ్యగ్రంథం. రమణ బాల్య స్నేహితులు బొల్లినేని కృష్ణయ్య ఆర్థిక సహకారంతో అన్వేషి వీరబ్రహ్మం గారు రచనా సంకలన బాధ్యతలు చేపట్టారు.
ఈ గ్రంథం లభించుచోటు :
సి.వి. ప్రసాద్‌, సోమరాజు పల్లి (ఎస్‌.సి. కాలనీ) సింగరాయకొండ- 523104, ప్రకాశం జిల్లా. సెల్‌ : 94901 75160.
- కె. శాంతారావు
9959745723

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top