ప్రజాశక్తి - సాలూరు: సాలూరు నియోజకవర్గాన్ని రూ.490 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
ఈ నిధులతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసే దిశలో అంతా కలిసి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సాదిద్దామని, ఇందుకోసం ఇతర పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అత్యాధునిక మిషనరీ ద్వారా తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రాన్ని స్విచ్ ఆన్ చేసి మంత్రి మంగళవారం ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్‌లో జరుగుతున్న చెత్త వేరుచేసే ప్రక్రియను ఆమె పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చెత్త నుండి సంపద సృష్టించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. గత ఐదేళ్లలో పక్కన పడేసిన టన్నుల కొద్దీ చెత్తను ఇప్పుడు అత్యాధునిక మిషనరీ ద్వారా తడి, పొడి చెత్తగా విడదీస్తున్నామని, ఇందులో నుంచి ప్లాస్టిక్‌ను వైజాగ్ తరలిస్తున్నామని, మట్టిని ల్యాండ్ ఫిలింగ్ కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు సాలూరు మున్సిపాలిటీ చెత్త నిర్వహణలో ఆదర్శంగా ఉండేదని, గతంలో ఇక్కడి డంపింగ్ యార్డ్‌లోనే మున్సిపల్ కమిషనర్ తన కుమార్తె వివాహం జరిపించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ మునిసిపాలిటీ గతంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుందని అన్నారు.
అనంతరం చెత్తను సేకరించే డబ్బాలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, జాయింట్ కలెక్టర్, మునిసిపల్ ప్రత్యేక అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, కమిషనర్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.6వేల మందితో 22న భారీ కోలాటం ప్రదర్శన గిరిజనసంస్కృతి, సాంప్రదాయా లను విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో మన్యం జిల్లాలో ఈ నెల 22న భారీ స్థాయిలో కోలాట ప్రదర్శనను నిర్వహించనున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన రికార్డు స్ఫూర్తితో, ఇప్పుడు మన జిల్లాలో ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. సాధారణంగా 20 నుండి 40 మందితో చేసే కోలాటాన్ని ఈసారి వేల మంది విద్యార్థులతో ప్రదర్శించి ఒక కొత్త రికార్డును సృష్టించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమన్నారు. ఈ కోలాటంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఇందులో భాగస్వాములు అవుతారని, ఆసక్తి గల వారు ఐటిడిఎ, కలెక్టర్ కార్యాలయంలో గాని తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపే ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని మంత్రి కోరారు.

