అక్షరాలు దిద్దే ప్రాయంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ అబ్బాయి. చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభ చూపుతూ భళా అంటూ ముందుకు సాగుతున్నాడు. ఆట ఏదైనా చాంఫియన్‌గా నిలవడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
ఆడిన ప్రతి ఆటలోనూ విజయఢంకా మోగిస్తూనే ఉన్నాడు. రెండు పదుల వయస్సులోనూ ప్రపంచ వేదికలపై పతకాలతో విన్యాసాలు చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో పాల్గొని దేశఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారుడు ఆరోన్ రొనాల్డినో.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన సి.శేఖర్, మేరీ జ్యోతిల దంపతులకు ఆరోన్ ఏప్రిల్ 12, 2007లో జన్మించారు. మేరీజ్యోతి ప్రయివేటు స్కూలులో ఉపాధ్యాయిని. తండ్రి శేఖర్ విద్యుత్తు విభాగంలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాన్న లాన్ టెన్నిస్ క్రీడాకారుడు. ఆయనే తొలి గురువు. మొదట్లో టెన్నిస్ నేర్చుకుని దానిలో నిపుణత సాధించిన తర్వాత సాఫ్ట్ టెన్నిస్‌ను ప్రారంభించారు. ఆరో తరగతి నుంచి మొదలైన లాన్ టెన్నిస్ ప్రయాణం 2021లో సాఫ్ట్ టెన్నిస్‌కు మారింది. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆటల పట్ల చురుగ్గా మరింతగా ఆసక్తి ఉందని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించారు. పాఠశాల, కళాశాలస్థాయిలో పలు ఆటల్లో ప్రతిభను కనబర్చి బహుమతులు సైతం గెల్చుకున్నాడు. చిన్పప్పటి నుంచి చరుగ్గా ఉండే అరోన్ విద్యలోనూ ప్రతిభ చూపుతున్నారు. ఆటల్లోనూ ప్రతిభ నిరూపించుకుంటున్నారు. క్రీడల్లో ఆరోన్ ప్రతిభ చూసి పాఠశాల ఉపాధ్యాయయులు ప్రోత్సహించారు. కళాశాలలో చేరిన తర్వాత ఆయన ప్రతిభ మరింతగా మెరుగైంది. సాఫ్ట్ టెన్నిస్ క్రీడలో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు కొల్లగొడుతూ అంతర్జాతీయ స్థాయికి వేగంగా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం గుంతకల్లులోని శంకరానందగిరిస్వామి డిగ్రీ కళాశాలలో బీసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. 2022లో పదోతరగతిని రైల్వే ఇంగ్లీష్ మీడియం హైస్కూలులో పూర్తిచేశారు. 2025లో ఇంటర్మీడియట్‌ను ఎస్‌ఎస్‌జిఎస్ కళాశాలలో పూర్తిచేశారు. ప్రస్తుతం గుంతకల్లులోని రైల్వే ఇనిస్టిట్యూట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇనిస్టిట్యూట్ కూడా బాగా ప్రోత్సహిస్తోంది.
పతకాల వేటపైనే గురి
టెన్నిస్‌ను బాగా ప్రాక్టీస్ చేసేవారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ బాగా ప్రావీణ్యం సంపాదించారు. అనంతరం అచ్చం టెన్నిస్ క్రీడలా ఉన్న సాఫ్ట్ టెన్నిస్ ఆటపై ఆసక్తి కనబర్చారు. తనలో ఆడాలన్న ఆసక్తి, తోటి క్రీడాకారుల ప్రోత్సాహంతో సాఫ్ట్ టెన్నిస్‌పై బాగా సాధన చేశారు. పలు పోటీల్లో పాల్గొనటంతో మంచి అనుభవం వచ్చింది. పతకాలు కైవసం చేసుకోవటం కూడా ప్రారంభించారు. టెన్నిస్ నుంచి సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారుడిగా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తూ వస్తున్నారు. అలా క్రీడల్లో రాణిస్తూనే ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. 2024 జనవరిలో రారుపూర్‌లో 67వ ఎస్‌జీఎఫ్ పోటీల్లో 17 ఏళ్లకే అండర్-19 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించారు.
తండ్రే కోచ్…
సాధారణంగా తమ పిల్లలకు క్రీడల్లో శిక్షకులు వేర్వేరుగా ఏర్పాటుచేస్తారు. కానీ అరోన్‌కు మాత్రం తండ్రే శిక్షకుడిగా ఉండి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయనే కుమారుడికి సాఫ్ట్ టెన్నిస్ ఆటలో నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. డైటీషియన్‌గా పి.నిస్సీకెరోలైన్, ఫిట్‌నెస్ కోచ్‌గా నూర్ మహ్మద్ వ్యవహరిస్తున్నారు. ఈ ఆటలో సెమీ వెస్ట్రన్ గ్రిప్ ఉపయోగించటంలో ఇతడు దిట్ట. రెడీ పొజిషన్, ఫుట్‌వర్క్, సర్వీస్, రిటర్న్, షాట్స్ అండ్ స్ట్రోక్స్, అందులోనూ ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, వాలీ, మెంటల్ అండ్ ఫిజికల్ అంశాల్లో మంచి ఫిట్‌గా తయారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.దిలీప్‌కుమార్, అధ్యక్షులు వి.శ్రీనుబాబు, చైర్మన్ నవీన్‌కుమార్, అనంతపురం జిల్లా సెక్రటరీ మేరీజ్యోతి తదితరులు అరోన్‌ను ప్రోత్సహించారు.
జాతీయ, అంతర్జాతీయస్థాయిలో సాధించిన విజయాలివీ…
పలు మ్యాచ్‌ల్లో ప్రతిభ కనబర్చారు. అంతర్జాతీయ పోటీల్లో మూడు మ్యాచ్‌లు గెలిచి క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లారు.రాష్ట్ర 18, జాతీయ 10, అంతర్జాతీయస్థాయిలో 6 పతకాలు పొందారు.
- 2024, నవంబర్ 1 నుంచి 7వ వరకూ చైనాలో జరిగిన 4వ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిిప్
- జూన్ 17 నుంచి 24 వరకూ 2024లో దక్షిణ కొరియాలో కొరియా ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్‌లో ప్రాతినిధ్యం
- మార్చి 17 నుంచి 22 వరకూ, 2025లో ఢిల్లీ నోయిడాలో జరిగిన రెండో ఇండియా ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ చాంఫియన్‌షిప్
- జులై 4 నుంచి 6 వరకూ, 2025లో పోలాండ్‌లో జరిగిన 18వ పోలాండ్ కప్ ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం
- ఫిబ్రవరి 3 నుంచి 8వ తేదీ, 2026 వరకూ లూథియానాలో జరిగిన రెండో జూనియర్ ఆసియన్ సాఫ్ట్ టెన్నిస్ చాంఫియన్‌షిఫ్‌లో ప్రాతినిధ్యం
- మార్చి 26 నుంచి 30 వరకూ థారులాండ్‌లోని పాథుమ్ ధానిలో జరిగిన ఆసియా విశ్వ విద్యాలయాల సాఫ్ట్ టెన్నిస్ చాంఫియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో కాంస్యం
- జనవరి 19 నుంచి 22 వరకూ 2024, చత్తీష్‌ఘడ్ రారుపూర్‌లో జరిగిన 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నేషనల్) వ్యక్తిగత స్థాయిలో బంగారు పతకం, టీమ్ విభాగంలో కాంస్య పతకం
- జూన్ 26 నుంచి 20 వరకూ 2025లో హరియానాలో జరిగిన మిక్సిడ్ డబుల్స్‌లో 20వ జూనియర్ నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ చాంఫియన్‌షిప్‌లో బంగారు పతకం
- నవంబర్ 9 నుంచి 11 వరకూ, 2023లో కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో వ్యక్తిగతంగానూ, టీవ్ ఈవెంట్‌లోనూ బంగారు పతకం
- ఆగస్టు 4 నుంచి 5వ తేదీ, 2024 విజయవాడలో జరిగిన ఎపి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ చాంఫియన్‌షిఫ్‌లో వ్యక్తిగతంగా బంగారు పతకం
- ఏప్రిల్ 28, 29 తేదీల్లో 2024లో జరిగిన ఎపి సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ ఎన్నిస్ చాంఫియన్‌షిఫ్‌లో బంగారుపతకం
- డిసెంబర్ 3,4 తేదీల్లో 2022లో కర్నూలులో జరిగిన ఎపి సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ చాంఫియన్‌షిఫ్‌లో ఇండివిడ్యువల్ సింగిల్స్‌లోనూ, టీమ్ ఈవెంట్‌లోనూ బంగారు పతకం
- మార్చి 12 నుంచి 14, 2022 వరకూ కడపలో జరిగిన ఎపి సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్‌లో విండువిడ్యువల్స్‌లో బంగారుపతకం
- మార్చి 13 నుంచి 14 తేదీల్లో 2025లో విజయవాడలో ఎపి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ చాంఫియన్‌షిప్‌లో విండివిడ్యువల్ సింగిల్స్‌లో బంగారుపతకం
- ఫిబ్రవరి 11 నుంచి 12వ తేదీ, 2023 వరకూ కడపలో జరిగిన ఎపి సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ చాంఫియన్‌షిప్‌లో టీమ్ ఈవెంట్‌లో సిల్వర్‌మెడల్
ప్రపంచచాంఫియన్‌షిప్ లక్ష్యం…
సాఫ్ట్ టెన్నిస్ సీనియర్స్ విభాగంలో ప్రపంచ చాంఫియన్‌గా నిలవాలన్నదే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషిచేస్తున్నా. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటా. ప్రపంచస్థాయి ప్రమాణాలతో శిక్షణ పొందుతున్నా. ఆసియా క్రీడల్లో జయకేతనాన్ని ఎగరేస్తా. ఖచ్చితంగా విజయాన్ని సాధించి భారతదేశ కీర్తిపతాకాన్ని ప్రపంచస్థాయిలో ఎగరేయాలన్నదే నా లక్ష్యం.
-ఆరోన్ రొనాల్డినో, సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారుడు, అనంతపురం
- యడవల్లి శ్రీనివాసరావు

