Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Samson - సంజూ శాంసన్‌ మరో అరుదైన ఘనత ..!

Samson - సంజూ శాంసన్‌ మరో అరుదైన ఘనత ..!

పిఎల్ : స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న అతడు, ఒక్క సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా కొత్త చరిత్ర సృష్టించారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసిన సంజూ, గతంలో ఎంఎస్ ధోనీ పేరుతో ఉన్న 461 పరుగుల రికార్డును అధిగమించారు. ధోని 2013 సీజన్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశారు. లీగ్ దశలో సీఎస్‌కేకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండటంతో, సంజూ 500 పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సీఎస్‌కే చరిత్రలో ఒకే సీజన్‌లో 500 పరుగులు చేసిన తొలి వికెట్‌కీపర్‌గా నిలుస్తారు.

ఈ రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో సంజూ దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. కేవలం 13 బంతుల్లోనే 27 పరుగులు చేసి, ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో అభిమానులను అలరించారు. తొలి బంతినే సిక్స్‌గా మలిచిన అతడు, వరుస బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. అయితే పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో ఔటై, భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని కోల్పోయారు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. బ్రెవిస్‌ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కార్తీక్ శర్మ 32, సంజూ 27, శివమ్ దూబే 26 పరుగులు చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీసి ప్రభావం చూపించారు. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలో కొంత ఇబ్బంది పడినా, ఇషాన్ కిషన్ 70 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్‌ 47 పరుగులతో జట్టును విజయానికి చేర్చారు. 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా, సీఎస్‌కే అవకాశాలు క్లిష్టంగా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti