Dailyhunt
సంస్థాగత నిర్మాణంపై టిడిపి దృష్టి

సంస్థాగత నిర్మాణంపై టిడిపి దృష్టి

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
జిల్లాలో సంస్థాగతంగా బలపడేందుకు తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. రెండున్నరేళ్ల వైసిపి పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలను తయారు చేస్తోంది.

పార్టీ కార్యక్రమాలు గ్రామస్థాయి నుంచి నిర్వహించేందుకు గ్రామ, వార్డు స్థాయి కమిటీలను నియమించనుంది. ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలపై దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ కార్యాలయం బుధవారం అనకాపల్లిలో ప్రారంభించనున్నారు. జివిఎంసి పరిధిలో పార్టీ కార్యాలయ కేంద్రంగా సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతున్నట్లే, అనకాపల్లి కేంద్రంగా గ్రామీణ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలు విస్తరింపజేయాలని ఆ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. అనకాపల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి లోకేష్‌ రాకను ఉపయోగించుకొని జిల్లా వ్యాపితంగా పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున తీసుకురావాలని నియోజకవర్గాల వారీగా లక్ష్యాలు విధించుకున్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో స్తబ్ధతగావున్న పార్టీ శ్రేణులను కదిలించే కార్యక్రమాలను రూపొందించాలని నాయకులు నిర్ణయించారు. లోకేష్‌ వస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చారనేది తెలుసుకొనేందుకు ప్రతి వాహనానికీ నియోజకవర్గం స్టిక్కర్‌ తప్పనిసరిగా వుండాలని సూచించారు. విజయసాయిరెడ్డి అక్రమాలు, వైసిపి నాయకులు భూ ఆక్రమణలు, గంజాయి వ్యాపారం, విద్యుత్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు భావిస్తున్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, బుద్దా వెంకన్న, బండారు సత్యనారాయణమూర్తి సహా మాట్లాడిన పలువురు నాయకులు ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కార్యక్రమాల ద్వారా తీసుకెళ్లాలని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti