- అద్భుత విన్యాసంతో గిన్నిస్ పుటల్లోకి
న్యూఢిల్లీ : సముద్రపు నీటి అడుగున 2400 చదరపు మీటర్ల అతిపెద్ద మువ్వన్నెల భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్‌లో నిర్వహించిన ఈ అద్భుత విన్యాసం గిన్నిస్ వరల్డ్ రికార్డు పుటల్లోకి ఎక్కింది.
సముద్ర జలాల అడుగున త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించేందుకు 223 మంది స్కూబా డైవర్లతో కూడిన బృందం ఈ నెల 2న ఏకకాలంలో సమన్వయంతో పనిచేసింది. ఈ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్ అధికారికంగా ధ్రువీకరించి, లెఫ్టినెంట్ గవర్నర్ డికె జోషికి సర్టిఫికెట్‌ను అందజేశారు. సముద్ర జలాల అడుగున ఆవిష్కరించిన జెండా సైజు 2,400 చదరపు మీటర్లు. దీని పొడవు 60 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు. ఈ రికార్డును సృష్టించిన జెండాను పాలిస్టర్ మెటీరియల్‌తో తయారు చేయించారు.

