- ప్రమాదబీమా, శాశ్వత అంగవైకల్యం, తాత్కాలిక వైద్య ఖర్చులు, స్కాలర్షిప్ అమలు చేయాలని డిమాండ్
- వివాహనికి ప్రకటనల్లో రూ. 40 వేలు, ఆదేశాల్లో రూ. 20 వేలు ఇవ్వడంమేంటని ప్రశ్న
ప్రజాశక్తి-కాకినాడ : భవన నిర్మాణ కార్మికుల 9 సంక్షేమ పధకాలు అమలు చేయాలని, 2020 ముందటి కార్డులను రెన్యూవల్ చేసి, 2019 నుండి పధకాలకై దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్, అదర్ కన్ స్ట్రాక్షన్ వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ (డీసీల్) బుల్లిరాణికి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కల రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఒరుగంటి నందేశ్వరరావు మాట్లాడుతూ 2019 నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బకాయి పెట్టిన 5 కోట్ల పరిహారాలు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెల్లించాలని, 2020 ముందటి గుర్తింపు కార్డులను రెన్యూవల్ చేయాలని, గతంలో బకాయి రుసుముకట్టి కార్మికులు పధకాలు పొందేందుకు అర్హులని ఇచ్చిన 298 జీవోని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం సంక్షేమబోర్డు నిలుపుదల చేసేనాటికి అమలులో ఉన్న ప్రమాద భీమా, తాత్కాలిక అంగవైకల్యం (హాస్పిటలైజేషన్), శాశ్వత అంగవైకల్యం, పిల్లల చదువులు స్కాలర్షిప్ పధకాల ఊసెత్తకుండా ఎన్నికల హామీ అమలు చేసేసామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మార్చి 1 కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన మేరకు కార్మికుని కూతురి వివహ బహుమతి 40 వేలు చెల్లించేలా కార్మికశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పధకాలు పొందేందుకు కార్మికశాఖ అధికారులు స్థానిక కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల సత్యనారాయణ, వై,సత్యనారాయణ, పప్పుల వీరబాబు, డేగల సత్యనారాయణ, వీరబాబు, చేబ్రోలు రమణ, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, టి రాజా తదితరులు పాల్గొన్నారు.

