Dailyhunt
సంతానం కలగలేదనే...

సంతానం కలగలేదనే...

- భార్యను చంపిన కేసులో భర్త అరెస్టు
- త్వరితగతిన కేసును చేధించిన మద్దిపాడు పోలీసులు

ప్రజాశక్తి-ఒంగోలు క్రైం: సంతానం కలగడం లేదని భార్యను హత్య చేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్‌పి యు.నాగరాజు వివరాలు వెల్లడించారు. పల్లపు ఆదిలక్ష్మి(20)కి, అద్దంకికి చెందిన పాపారావుతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో భర్త పాపారావు ఆమెను వేధించడం ప్రారంభించారు. అనేకసార్లు వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి.

గొడవలు జరిగినప్పుడు ఆదిలక్ష్మి ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది. ఆదిలక్ష్మిని అడ్డు తొలగించుకొని మరో వివాహం చేసుకోవాలని పాపారావు భావించాడు. కుటుంబసభ్యులు కూడా అతనికి మద్దతు పలికారు. పుట్టింట్లో ఉన్న ఆదిలక్ష్మి వద్దకు పాపారావు వెళ్లి..

పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తే సంతానం కలుగుతారని చెప్పి.. భార్యను తీసుకెళ్లారు. ఈ నెల 15న శింగరకొండ, శ్రీశైలం, తరువాత మల్లవరం వద్ద దేవాలయానికి వెళ్లారు. పథకం ప్రకారం పాపారావు గుండ్లకమ్మ రిజర్వాయర్‌ వద్ద ఆదిలక్ష్మి తలపై రాయితో మోది హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని గుండ్లకమ్మలో పడేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతురాలి తండ్రి తమ కుమార్తె కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో గుండ్లకమ్మలో వెలుగుచూసిన మృతదేహం ఆదిలక్ష్మిగా తేలింది. విచారణలో భర్త పాపారావే ఆమెను హత్య చేసినట్లు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతను ఉపయోగించిన మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును వెంటనే ఛేధించిన రూరల్‌ సిఐ ఆర్‌.రాంబాబు, మద్దిపాడు ఎస్‌ఐ నాగరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti