Dailyhunt
సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకురాలు జయమ్మ కన్నుమూత

సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకురాలు జయమ్మ కన్నుమూత

* జయమ్మ విప్లవ జీవితం అందరికీ ఆదర్శం కావాలి : సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ కేంద్ర కమిటీ సభ్యులు నైనాలశెట్టి మూర్తి
శ్రీకాకుళం : సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకురాలు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అజ్ఞాత జీవితం గడిపిన పోతనపల్లి జయమ్మ (65) సోమవారం ఉదయం తన స్వగ్రామం బడ్డపాడు లో కన్నుమూశారు.
సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ కేంద్ర కమిటీ సభ్యులు నైనాలశెట్టి మూర్తి మాట్లాడుతూ... శ్రీకాకుళం ఉద్యమ సీనియర్‌ నాయకులు జయమ్మ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బడ్డపాడు గ్రామం వెళ్లినప్పుడు పలు సందర్భాల్లో ఆమెను కలిసేవాడినని, అనారోగ్యం వెంటాడుతున్నప్పటికీ ఆమెలో విప్లవ నిబద్ధత సడల లేదని చెప్పారు.

కమ్యూనిస్టు ఉద్యమంలో ఎదురైన ఆటుపోట్లవల్ల కాని, ఆమె భర్త కుమారన్న మరణం కాని ఆమెను కుంగదీయలేదని అన్నారు. జీవితాంతం విప్లవ నిబద్ధతతో జీవించిన వీరవనిత జయమ్మ అని స్మరించుకున్నారు. ఆమె విప్లవ జీవితం అందరికీ ఆదర్శం కావాలని కోరారు. సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ కేంద్ర కమిటీ తరపున జయమ్మ కు విప్లవ జోహార్లు అర్పించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ బడ్డపాడు యూనిట్‌, జిల్లా కమిటి నేత సన్యాసిరావు, కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలు జయమ్మకు విప్లవ జోహార్లు అర్పించారు.
సిపిఐ ఎంఎల్‌ నేతలు మాట్లాడుతూ... జయమ్మ (65) చిన్ననాటి జీవితం లక్కవరంలో గడిపారని తెలిపారు. ఆమె 50 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం పెళ్ళి, పిల్లలు యావత్తు జీవితం మొత్తం విప్లవోద్యమంలోనే సాగిందన్నారు. విప్లవోద్యమంలో ఆమె భర్త కుమార్‌, జయమ్మ లు వ్యవస్థ మార్పుకు తీవ్ర కృషి చేశారని చెప్పారు. వీరి త్యాగాలు ఊరకనే పోవని... వీరు మిగిల్చిన ఆశయాలు, బడ్డపాడు ప్రజలు, ఉద్దాన ప్రాంత ప్రజలు, విప్లవ ప్రజా సంఘాలు ముందుకు తీసుకెళతాయని పేర్కొన్నారు. జయమ్మ మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించి, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జయమ్మకు సిపిఐ ఎంఎల్‌ నేతలు కామేశ్వరరావు, వాసు, దుష్యంత్‌, ఈశ్వరి, తులసమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు సన్యాసిరావు, తదితరులు జోహార్లు అర్పించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti