100 శాతం చెత్త సేకరణలో అలసత్వం తగదు : కమిషనర్ చల్లా ఓబులేసు
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : నగరంలో ఉన్న వాణిజ్య దుకాణాల వద్ద తప్పనిసరిగా నిర్వాహకులు డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలని, స్వచ్ఛతకు సహకరించకపోతే జరిమాన విధింపు, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు.
సోమవారం ఉదయం 2వ శానిటేషన్ డివిజన్‌లో మస్టర్ తనిఖీ నిర్వహించారు. కుమ్మరి గేరి, గడియారం ఆసుపత్రి, పెద్ద మార్కెట్, జమ్మిచెట్టు, జొహరపురం, గాంధీనగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పలు దుకాణాల వద్ద డస్ట్‌బిన్‌లు లేకపోవడం, ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండటంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బంది పరిశుభ్రతపై మరింత పట్టు సాధించాలని, ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఏర్పాటు చేసి, 100 శాతం చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ట్రాలీలను వ్యాపారస్తులు సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడాలని సూచించారు. అలాగే వినాయక ఘాట్ వద్ద కేసి కెనాల్‌ను కమిషనర్ పరిశీలించారు. గ్యాంగ్ వర్క్ పెట్టి, శుభ్రం చేయించాలని ఆదేశించారు.
అన్న క్యాంటీన్ల నిర్వాహకులపై అసంతృప్తి …
కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్, అక్కడ అల్పాహారం చేస్తున్న ప్రజలతో మాట్లాడి నాణ్యత ప్రమాణాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత సరిగా లేదని ఫిర్యాదులు రావడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్, భోజనాశాల నిర్వహకులతో ఫోన్‌లో మాట్లాడి రుచికరంగా, ప్రమాణాలకు అనుగుణంగా వంటలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఆర్. రాజు, నాగేశ్వరరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

