ప్రభుత్వం మాత్రం మొండిగా పరీక్ష నిర్వహణకు మొగ్గు
ఉపాధ్యాయులకు అందుబాటులో లేని టీక
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దు చేయాలని డిమాండ్
ప్రజాశక్తి -కర్నూల్ కలెక్టరేట్: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు మొండిగా వ్యవహరిస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు మాత్రం రద్దు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో ఈ ఏడాది దాదాపుగా 62 వేల మంది విద్యార్థులు పదవ తరగతి అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహించడం అంతా సరైంది కాదని పలువురు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలి
కె.సురేష్ కుమార్ యుటిఎఫ్ రాష్ట్ర సహాఅధ్యక్షుడు
ప్రస్తుతం కరోనా సెకండ్ వెవ్ విజంభిస్తున్న నేపథ్యంలో పదోతరగతి పరీక్షలు నిర్వహించడం సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి. విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా వైరస్ బారిన పడితే పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతాయి. అందుకే పరీక్షలను రద్దు చేసి విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రాణాలను కాపాడాలి.
పరీక్షల నిర్వహణ సరైంది కాదు
భాస్కర్ పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు
పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. వెంటనే పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలి. ఇంటర్‌కు ప్రమోట్ చేయాలి.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
ప్రకాష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం కావడం సరైంది కాదు. విద్యార్థులకు కరోనా వస్తే ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయి. ఇలాంటి సమయంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైంది కాదు. వెంటనే పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి.

