ఎండాకాలంలో చాలా మంది అన్నంలో తినేందుకు అప్పడాలు, వడియాలతో పాటూ ఊర మిరపకాయలనూ ఇష్టపడుతుంటారు. వీటినే మజ్జిగ మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు అని పిలుస్తుంటారు.
వీటిని చేసుకోవాలంటే పెరుగు లేదా మజ్జిగలో నానబెట్టి ఐదు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. పెరుగు, మజ్జిగ లేకుండా కూడా ఊర మిరపకాయలను సింపుల్‌గా తయారుచేసుకోవచ్చు. ఇవి సాంబార్, పప్పన్నం, పెరుగన్నం, పప్పుచారులోకి సైడ్ డిష్‌గా సూపర్‌గా ఉంటాయి. ఇవి నోటికి కాస్త కారంగా, ఉప్పగా ఉంటూ భలే రుచినిస్తాయి. ఏడాది పాటు నిల్వ ఉండే వీటి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం.
వాముతో..
కావాల్సినవి: పచ్చిమిర్చి - కేజీ, వాము - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మకాయలు - రెండు.
తయారీ : కారం తక్కువ, కండగల పచ్చిమిరపకాయలను తీసుకొని, తొడిమలు తీయకుండానే శుభ్రంగా కడిగి, చిల్లులు గిన్నెలో వేసుకోవాలి. ఓ క్లాత్‌పై వేసి, తడిలేకుండా కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. మిరపకాయ లను తొడిమెతో సహా ఉండేలా మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకొని, ఓ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీజార్‌లో వామువేసి, మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకొని, అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో ఉప్పు, గ్రైండ్ చేసుకున్న వాము పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవాలి. పచ్చిమిర్చి మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టేలా చేతితో బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చికి ఉప్పు, పులుపు బాగా పట్టి మజ్జిగలో ఊరబెట్టినప్పుడు ఏవిధమైన టేస్ట్ వస్తుందో అలాంటి రుచే వస్తుంది. వాటిని ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ లేదా గాజు డబ్బాలో వేసి, మూత పెట్టుకుని, 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఊరబెట్టిన 24 గంటల తర్వాత అందులో నీరు ఊరుతుంది. మూత తీసి ఒకసారి మిరపకాయలను పైకి కిందకి, కలిపి ఆ నీటిని రుచి చూడండి. అలాగే, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వీటిని ఒకసారి పూర్తిగా పైకి కిందకి కలపడం చేస్తుండాలి. నాలుగో రోజు ఓ క్లాత్‌పై పలుచగా వేసుకుని, కనీసం 3 నుంచి 5 రోజు ఎండబెట్టుకోవాలి. ఈ ఊర మిరపకాయలు బాగా ఎండిన తర్వాత వాటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. తినాలనిపించినప్పుడు స్టౌపై ఆయిల్లో ఎర్రగా వేపి, తీసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వాము చల్ల మిరపకాయలు రెడీ!
పచ్చిమామిడితో..
కావాల్సినవి: పచ్చిమిర్చి- కిలో, అల్లం - రెండు ఇంచెలు, జీలకర్ర - 2 స్పూన్లు, ధనియాలు - 3 స్పూన్లు, మెంతులు - స్పూన్, పుల్ల మామిడికాయలు - 2 (పెద్దది), పెరుగు - 500గ్రా॥, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ: మిరపకాయలు తొడిమలు తీయకుండానే శుభ్రం చేసుకొని, తడిలేకుండా క్లాత్‌తో చాకుతో మధ్యలో నిలువుగా చీరుకుని పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇపుడు పొయ్యిపై కడాయి పెట్టుకుని జీలకర్ర, ధనియాలు, మెంతులు సన్నటి మంటపై వేయించుకుని, పక్కకు పెట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మామిడికాయ పైచెక్కు తీసుకొని, ముక్కలుగా కట్ చేసుకుని, మిక్సీలో వేసుకోవాలి. మిక్సీజార్‌లో మామిడికాయ ముక్కలతో పాటు అల్లం ముక్కలు వేసుకుని రుబ్బుకోవాలి. సగం రుబ్బుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రెడీ చేసుకున్న మామిడి మిశ్రమం, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడిలను పచ్చిమిర్చి చీలికల్లో వేసి కలపాలి. తర్వాత పసుపు, పెరుగు స్టఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చల్ల మిరపకాయలను డబ్బాలో వేసుకుని, మూత పెట్టి ఊరబెట్టుకోవాలి. రెండు గంటలకోసారి మిరపకాయల ను పైకి, కిందికి కదుపుకుంటే అన్నీ చక్కగా ఊరిపోతాయి. మూడు రోజుల తర్వాత డబ్బాలో ఉన్న మిర్చిని తీసుకుని ఎండలో క్లాత్‌పై ఆరబెట్టుకోవాలి. మళ్లీ మరుసటి రోజు ఇలాగే చేయాలి. మూడు రోజుల పాటు ఇదే ప్రాసెస్‌లో ఎండలో ఆర బెట్టుకుంటే సరిపోతుంది. మిర్చి పూర్తిగా ఎండిపోయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.

