Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిండి గింజలూ అదానీ గుప్పిట్లోకే.

తిండి గింజలూ అదానీ గుప్పిట్లోకే.

  • ఆధునిక నిల్వ కేంద్రాల పేరుతో గుత్తాధిపత్యం
  • రూ.9700కోట్ల సైలో ప్రాజెక్టు కట్టబెట్టిన మోడీ సర్కార్‌
  • 'న్యూస్‌ లాండ్రీ' *ప్రత్యేక కథనంలో వెల్లడి
  • ప్రముఖులు, నిపుణుల ఆందోళన

న్యూఢిల్లీ : పేదల నోళ్ళు కొట్టి, కార్పొరేట్ల జేబులు నింపాలన్న మోడీ సర్కార్‌ మంత్రాంగాలకు, చర్యలకు హద్దూ పద్దూ వుండడం లేదు. తాజాగా ఆ కోవలోకి చేరిందే భారత ఆహార సంస్థ (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-ఎఫ్‌సిఐ)కి చెందిన 'సైలో పథకం'. ఈ ప్రాజెక్టు వల్ల తలెత్తే పరిస్థితులు, ఇందులోని లోపాలు, లొసుగులపై స్వతంత్ర వార్తా సంస్థ 'న్యూస్‌ లాండ్రీ' ప్రత్యేక పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది. ఆ కథనం ప్రకారం.. వాతావరణ మార్పులు కారణంగా, అలాగే ఎలుకలు, పురుగులు వంటి వాటి వల్ల ప్రతి ఏటా వేలాది టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నందున, వాటిని అరికట్టే సాకుతో మోడీ ప్రభుత్వం ఈ సైలో ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటివరకు ఎఫ్‌సిఐ దేశవ్యాప్తంగా తన గిడ్డంగుల్లో పాత పద్ధతిలోనే గోనె సంచుల్లో ధాన్యాన్ని నిల్వ వుంచుతోంది. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి చెప్పి వాటి స్థానంలో ఆధునికమైన స్టీల్‌ సైలోస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు రూ.9700 కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో టెండర్లను ఆహ్వానించారు.

కార్పొరేట్‌ గుత్తాధిపత్యానికి పట్టం

అయితే, టెండర్లు పిలవడానికి ముందుగానే ప్రభుత్వం, ఎఫ్‌సిఐ టెండర్‌ నిబంధనల్లో వుండే కీలకమైన 'యాంటీ మొనోపొలీ (గుత్తాధిపత్య వ్యతిరేక) క్లాజ్‌ను తొలగించింది. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. యాంటీ కాన్‌సెంట్రేషన్‌ క్లాజ్‌గా కూడా పిలిచే ఈ నిబంధన ఈ టెండర్ల వ్యవహారానికి ఒక రక్షణ వలయంగా నిలిచేది. యాంటీ మొనోపొలీ నిబంధన ప్రకారం, దేశవ్యాప్తంగా ఒకే కంపెనీ లేదా సంస్థ రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో టెండర్లను దక్కించుకోరాదు. ఈ నిబంధనను అమలు చేయడం వల్ల మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీ వుంటుంది. పైగా చిన్న కంపెనీలకు కూడా టెండర్లు దక్కించుకునే అవకాశం వుంటుంది. అయితే మోడీ ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించింది. ఇటీవల ఎఫ్‌సిఐ జారీ చేసిన టెండర్‌ మార్గదర్శకాల్లో 'ఏకచ్ఛత్రాధిపత్య నిరోధక' నిబంధనను తొలగించడమో లేదా సడలించడమో జరిగింది. ఫలితంగా, అదానీ గ్రూప్ అయిన అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ అత్యధికంగా లాభపడింది. టెండర్‌ నిబంధనలను మార్చిన తర్వాత జరిగిన వేలం పాటలో ఈ సంస్థ పలు రాష్ట్రాల్లో మెజారిటీ స్థాయిలో సైలో ప్రాజెక్టులను చేజిక్కించుకుంది. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, వంటి ధాన్యం ప్రధానంగా పండించే రాష్టాల్లో అదానీదే ఆధిపత్యం. మొత్తంగా భారత ప్రభుత్వ గోదాముల్లో ధాన్యం నిల్వ సామర్ధ్యంలో అదానీ గ్రూప్‌ వాటా భారీ స్థాయిలో పెరిగింది.

ప్రధాన ఆందోళనలు

తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆహార భద్రతా రంగంపై గుత్తాధిపత్యం అంతా ఒక ప్రైవేట్‌ సంస్థ చేతుల్లోకి వెళుతోంది. దీనివల్ల భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులు గనక నెలకొంటే అప్పడు ప్రభుత్వం పూర్తిగా ఆ సంస్థపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికే అదానీ గ్రూప్‌నకు దేశంలోనే భారీ స్థాయిలో ప్రైవేట్‌ ఓడరేవులు, రైల్వే లైన్లు, రవాణా నెట్‌వర్క్‌ వున్నాయి. తాజాగా ధాన్యం నిల్వ కేంద్రాలు కూడా వారి వశమవడంతో ఇక పంట పండడం దగ్గర నుండి రవాణా, నిల్వ వరకు అన్ని స్థాయిల్లోనూ సరఫరా గొలుసు మొత్తంగా అదానీ గ్రూప్‌ చేతుల్లోనే వుండే పరిస్థితి తలెత్తుతుంది. ఇది పౌర, ఆర్థిక ప్రముఖులు, నిపుణులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపక్షాల నుండి కూడా తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. మరోవైపు చిన్న కంపెనీలకు మనుగడ లేకుండా పోయింది. టెండర్‌ నిబంధనల్లో తీసుకువచ్చిన మార్పుతో ఆర్థికంగా పెద్దగా బలం లేని చిన్న కంపెనీలు, స్థానిక కంపెనీలు బిడ్డింగ్‌ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఎఐకెఎస్‌ ఖండన

తిండి గింజలు కూడా అదానీ గుప్పిట్లోకి వెళ్ళేలా వ్యవహరించిన మోడీ సర్కార్‌ తీరును అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలె, విజూ కృష్ణన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ గిడ్డంగులను కార్పొరేట్‌ సంస్థలు స్వాధీనం చేసుకోవడాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. వెంటనే యాంటీ మోనోపోలి నిబంధనను చేర్చాలని కోరారు. అలాగే సైలో సామర్ధ్యల్లో కార్పొరేట్‌ గ్రూపుల వాటాలపై పరిమితిని విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేయించాలని కోరారు. ప్రభుత్వ పెట్టుబడులతోనే ఎఫ్‌సిఐ నిల్వ సామర్ధ్యలను పెంచాలని పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ తక్షణమే చేపట్టాల్సిన అవససరం ఎంతైనా వుందని పేర్కొన్నారు. దేశ ఆహార భద్రతా రంగాన్ని ఇలా కొల్లగొట్టడాన్ని వ్యతిరేకించాలంటూ రైతాంగానికి, వ్యవసాయ కార్మికులు, అన్ని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti